Gautam Gambhir: విచారణ జరపండి: హైకోర్టు

24 May, 2021 13:27 IST|Sakshi

డీసీజీఐకి హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ:  ఫావిపిరవిర్‌ ఔషధ పంపిణీ విషయంలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. గంభీర్‌కు ఇంతపెద్ద మొత్తంలో ఫావిపిరవిర్‌ ఎలా లభించిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టమని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌ పెద్ద మొత్తంలో ఔషధాలను నిల్వ ఉంచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఒకే వ్యక్తి ఇలా ఔషధాలు నిల్వ చేయడం వల్ల ఇతర నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ విషయంపై డీసీజీఐ విచారణ చేపడతుంది. ఆయన ఒక జాతీయ క్రీడాకారుడు. మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశారని భావిస్తున్నాం. ఆయన సంకల్పం మంచిదే అయినా, ఎంచుకున్న విధానం సరికాదు. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా సరే, ఇది సరికాదు. అసలు ఆయనకు అంతపెద్ద మొత్తంలో కెమిస్టు మందులు ఎలా ఇచ్చారు. ఏ ప్రిస్కిప్షన్‌ చూసి ఇచ్చారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టండి. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకోండి’’ అని ఆదేశించింది. కాగా గతంలో కూడా గంభీర్‌ ఫాబిఫ్లూ మెడిసిన్‌ పంపిణీ చేస్తున్న అంశంపై కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే.

చదవండి: Vaccination: తప్పించుకునేందుకు నదిలో దూకారు!

మరిన్ని వార్తలు