నిబంధనలు ఉల్లంఘిస్తే విమానం నుంచి దింపేయండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

3 Jun, 2022 14:37 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని ఢిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్‌ నిబంధనలు పాటించకుంటే విమానం నుంచి దింపేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో విమాన ప్రయాణంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంపై పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం కోవిడ్‌ నిబంధనలు అమలు చేయడమే కాకుండా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని పేర్కొంది.

కరోనా కట్టడి చేసే దిశగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా మాస్క్‌ ధరించడం, హ్యండ్‌ శానిటైజేషన్‌ వంటి నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఉల్లంఘించే ప్రయాణికుల పై కఠిన చర్యలు తీసుకునేలా విమానాశ్రయాలు, విమానాల సిబ్బందికి పూర్తి అధికారాలు ఇస్తూ కరోనాకి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయమని డీజీసీఏని ఆదేశించింది. పైగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధించడం తోపాటు సదరు వ్యక్తుల పేర్లను కూడా నో ఫ్లై లిస్ట్‌లో ఉంచాలని ఆదేశించింది. ఐతే ధర్మాసనం తినేటప్పుడు లేదా తాగేటప్పుడు మాస్క్‌ని తొలగించేలా చిన్న వెసుల బాటు కల్పించింది.

(చదవండి: కరోనా కేసులు పైపైకి.. అక్కడ మళ్లీ మాస్క్‌ సంకేతాలు!)

>
మరిన్ని వార్తలు