‘‘టీకాలు లేనప్పుడు విసిగించే ఆ కాలర్‌ ట్యూన్‌ ఎందుకు?’’

14 May, 2021 14:39 IST|Sakshi
ఢిల్లీ హై కోర్టు (ఫైల్‌ ఫోటో)

సెల్‌ఫోన్‌లో వినిపించే డయలర్‌ ట్యూన్‌పై ఢిల్లీ హైకోర్టు అసహనం

ప్రభుత్వాలు మరింత సృజనాత్మకంగా ఉండాలని సూచన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేనప్పుడు టీకా తీసుకోవాలని ప్రజలను కోరడం ఏంటని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. టీకా వేయించుకోవాలని ప్రజలను కోరుతూ సెల్‌ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం వినిపిస్తున్న డయలర్‌ ట్యూన్‌ సందేశంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కాలర్‌ ట్యూన్‌ చికాకు కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. అసలు టీకాలే లేనప్పుడు దాన్ని వేయించుకోవాలని కోరడం అర్థం లేని పని అని స్పష్టం చేసింది. 

ఎవరికైనా ఫోన్‌ చేసిన ప్రతిసారీ ఈ డయలర్‌ టోన్‌ వినిపిస్తోందని.. ఇది జనాల సహనాన్ని పరీక్షిస్తోందని కోర్టు ఆపేక్షించింది. వ్యాక్సిన్‌ తీసుకొండి అని చెబుతున్నారు.. అసలు టీకానే లేనప్పుడు ఎవరైనా ఎలా తీసుకోవాలి అసలు ఈ సందేశంతో ఏం చెప్పదల్చుకున్నారు అని జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ రేఖా పల్లితో కూడిన ఢిల్లీ హై కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. 

అలానే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలి. డబ్బులు తీసుకునైనా సరే జనాలకు టీకా ఇవ్వండి. చిన్న పిల్లలు కూడా ఇదే చెబుతారు అని కోర్టు స్పష్టం చేసింది. ఇక కోవిడ్‌పై జనాలకు అవగాహన కల్పించే విషయంలో ప్రభుత్వాలు మరింత సృజనాత్మకంగా ఉండాలని కోర్టు సూచించింది. ఒక్క డయలర్‌ ట్యూన్‌నే పదే పదే వినిపించే కంటే.. ఎక్కువ సందేశాలు రూపొందించి.. మార్చి మార్చి వాటిని వినిపించాలని.. దీని వల్ల జనాలకు మేలు కలుగుతుందని తెలిపింది. 

ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌, సిలిండర్ల వాడకం, టీకాలపై జనాలకు అవగాహన కల్పించడానికి టీవీ యాంకర్లు, నిర్మాతలను ఉపయోగించుకుని కార్యక్రమాలను రూపొందించాలని.. అమితాబ్‌ వంటి పెద్ద పెద్ద నటులను దీనిలో భాగస్వామ్యం చేసి అన్నీ చానెల్స్‌లో వీటిని ప్రసారం చేయాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది.

గతేడాది కోవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం వంటి అంశాల గురించి భారీ ఎత్తున ప్రచారం చేశారని..  ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌, మందులు మొదలైన వాటి వాడకంపై కూడా ఇలాంటి ఆడియో-విజువల్ కార్యక్రమాలు రూపొందించాలని కోర్టు తెలిపింది.

ప్రింట్ మీడియా, టీవీ ద్వారా కోవిడ్‌ నిర్వహణపై సమాచారాన్ని ప్రచారం  చేయడానికి వారు ఏ చర్యలు తీసుకోబోతున్నారనే దానిపైన, అలానే డయలర్‌ ట్యూన్ల విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకున్నారనే దాని గురించి  మే 18 లోగా తమ నివేదికలను దాఖలు చేయాలని కోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. 

చదవండి: టీకా కొరత.. మేం ఉరేసుకోవాలా ఏంటి: కేంద్ర మంత్రి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు