బంగ్లా ఖాళీ చేయాలని సుబ్రహ్మణ్య స్వామికి నోటీసులు.. బీజేపీ మాజీ ఎంపీ రియాక్షన్ ఇదే..

14 Sep, 2022 17:15 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందుకు ఆరు వారాలు గడువిస్తూ నోటీసులు పంపింది. సుబ్రహ్మణ్యస్వామికి కేంద్రం 2016 జనవరిలో ఢిల్లీలో అధికారిక నివాసం కేటాయించింది. రాజ్యసభ ఎంపీ అయిన ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. దీంతో బంగ్లాను ఇతర ఎంపీలకు కేటాయించాల్సి ఉన్నందున  ఆయన ఖాళీ చేయాలని కోర్టు సూచించింది.

సుబ్రహ్మణ్యం రియాక్షన్..
అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. 2016లో తాను ఎంపీ కాకముందే భద్రతా కారణాల దృష్ట్యా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనకు జడ్ ప్లస్ కేటగిరీతో ఢిల్లీలో బంగ్లా కేటాయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాను ఎంపీ అయ్యాక అదే బంగ్లాలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. తనకు బంగ్లా కావాలని ఎప్పుడూ ఎవర్నీ అడగలేదని స్పష్టం చేశారు.

అయితే పాత ఒప్పందం మళ్లీ కొనసాగుతుందా అని భద్రతా అధికారులకు లేఖ రాశానని వివరించారు. ఈ విషయంపైనే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కానీ కేంద్రం తనకు బంగ్లా కేటాయించలేమని చెప్పిందని పేర్కొన్నారు. అందులో ఇబ్బందేమీ లేదని, తాను బంగ్లా ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు.
చదవండి: డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్య

మరిన్ని వార్తలు