టీకాలు లేకుండానే వ్యాక్సినేషన్‌ కేంద్రాలా?

3 Jun, 2021 14:33 IST|Sakshi
ఢిల్లీ సర్కారుపై హైకోర్టు మండిపాటు

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ప్రభుత్వ తీరును ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కరోనా టీకా కోవాగ్జిన్‌ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు ఇవ్వగలమో లేదో నిర్ధారణ కాకుండానే వ్యాక్సినేషన్‌ కేంద్రాలను, వ్యాక్సినేషన్‌ను ఆర్భాటంగా ప్రారంభించడం ఏమిటని నిలదీసింది. సరిపడా టీకాలు లేకుండానే వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టడం సరైంది కాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ రేఖా పల్లీ ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేశారు. కోవాగ్జిన్‌ మొదటి డోసు తీసుకున్నవారికి నిర్దేశిత గడువులోగా రెండో డోసు ఇస్తారో లేదో చెప్పాలని ఆదేశించారు.

మహారాష్ట్రలో రెండో డోసు ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపివేశారని పేర్కొన్నారు. ఢిల్లీలో కోవాగ్జిన్‌ ఫస్టు డోసు వేయించుకున్నవారికి సెకండ్‌ డోసు దొరకడం లేదని పేర్కొంటూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్‌ రేఖా పల్లీ బుధవారం విచారణ చేపట్టారు. అలాగే ఢిల్లీలో సెకండ్‌ డోసు ఇవ్వడానికి కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై న్యాయమూర్తి స్పందించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేశారు. 

చదవండి: వ్యాక్సిన్‌ కొనుగోలుపై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

>
మరిన్ని వార్తలు