Delhi Horror: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

13 Jan, 2023 15:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న యువతిని కారులో ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష‍్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర హోంశాఖ. మొత్తం 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో పాటు 10 మంది పోలీసులపై వేటు వేసింది. జనవరి 1న ఈ ఘటన జరిగిన రూట్‌లో డ్యూటీ చేసిన అధికారులపై ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది. వీరంతా ఆ రోజు మూడు పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్లు, రెండు పికెట్లలో విధులు నిర్వహించారు.

ఢిల్లీ కంఝవాలాలో జనవరి 1న స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టారు కొందరు యువకులు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపారు. అంజలి చక్రాల మధ్య ఇరుక్కున్నా పట్టించుకోకుండా 12 కిలోమీటర్లు కారును అలాగే రోడ్డుపై తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి మృతిచెందింది. తెల్లవారుజామున నడిరోడ్డుపై నగ్నంగా ఆమె మృతదేహం లభ్యమవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే అంజలిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన రోజు విధుల్లో ఉన్న పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆరోజు విధుల్లో నిర్లక్ష‍్యంగా వ్యవహరించిన పోలీసులను హోంశాఖ సస్పెండ్ చేసింది.
చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ..

మరిన్ని వార్తలు