అంజలి ఘటనతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. మహిళా కమిషన్‌ చైర్మన్‌ కీలక వ్యాఖ్యలు

5 Jan, 2023 16:50 IST|Sakshi

Delhi  Horror: ఢిల్లీ కారు ప్రమాదంలో మృతిచెందిన అంజలి సింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనలో తవ్వేకొద్ది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయంలో ఢిల్లీ పోలీసులు స్పందించలేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలతో ఢిల్లీ  అట్టుడుకుతోంది. నిందితులకు ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. 

సుల్తాన్‌పురి కారు ప్రమాద కేసులో పోలీసుల విచారణ సంతృప్తి కరంగా లేదంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ ఎస్ మలివాల్ మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిధి ఫోన్‌ స్వాధీనం చేసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అది ఈ కేసులో చాలా ముఖ్యమైన సాక్షం. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది.

పోలీసుల వైఫల్యం
పోలీసులు ఇప్పటికీ యువతి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన 13 కిలోమీటర్ల దూరంలోని అన్నీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదు. 164 సీఆర్‌పీసీ ప్రకారం ప్రత్యక్ష సాక్షులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయలేదు. కారు చక్రాల కింద యువతి మృదేహం చిక్కుకుందని ఉదయం 2.22 నిమిషాలకు పోలీసులుకు సమాచారం వచ్చింది. కానీ పోలీసులు ఉదయం.4.15 నిమిషాలకు నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం రోడ్డుపై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

18 బృందాలుగా
కాగా అంజలి సింగ్‌ కేసుపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. దీనిపై 18 బృందాలు పనిచేస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు అశుతోష్‌కు చెందినదిగా.. యాక్సిడెంట్‌ సమయంలో అమిత్‌ కారు డ్రైవ్‌ చేసినట్లుగా గుర్తించారు.  ఈ కేసులో మరో ఇద్దరి(అశుతోష్‌, అంకుష్‌) ప్రయేయం ఉన్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరిద్దరూ మిగతా అయిదుగురు నిందితులకు స్నేహితులని పేర్కొన్నారు. అయితే వీరు ప్రమాద సమయంలో కారులో లేరని, మిగిలిన ఐదుగురు నిందితులను రక్షించేందుకు ఇద్దరూ ప్రయత్నించారని పేర్కొన్నారు.

ఏ సంబంధం లేదు
నిందితులకు మృతురాలు, ఆమె స్నేహితురాలు నిధితో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితులు అనేక సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఈ కేసులో చార్జీషీట్‌ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇద్దరు కొత్త నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు కారు కింద అంజలి మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఆటోలో పరారయ్యాడని, అంజలి ఫోన్‌ ఇప్పటి వరకు దొరకలేదని వెల్లడించారు.
చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు