రైతుల నిరసన: ఆగిన ఆక్సిజన్‌ ట్రక్కులు..

28 Nov, 2020 12:24 IST|Sakshi

న్యూఢిల్లీ: రైతులు చేపట్టిన నిరసనలతో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్రక్కులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. శ్వాస కోశ సమస్య ఉన్న కరోనా రోగులకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ద్వారానే చికిత్స అందిస్తారు. బారికేడ్లు అడ్డుపెట్టడంతో ఆక్సిజన్‌ ట్రక్కులు పానిపట్‌, ఘాజీపూర్‌ సరిహద్దుల దగ్గరే గంటల తరబడి నిలిచిపోయాయి. తమకు కొన్ని గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్‌ మిగిలి ఉందని, ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోతోందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు సహకరించాలని కోరామని ఢిల్లీలోని ప్రైవేట్‌ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ట్రక్కులు చేరుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

అపోలో, గంగారామ్ ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ... తమ దగ్గర నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వ ఉందని, అయితే ఇప్పుడున్న పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే సమ​స్య మరింత జఠిలం అవుతుందన్నారు. సరిహద్దుల దగ్గర ఉన్న ట్రక్కులను తీసుకురావడానికి సకల ప్రయత్నాలు చేసస్తున్నామని, ఇప్పటికే హర్యానా, యూపీ, రాజస్థాన్‌‌ చీఫ్‌ సెక్రెటరీలతో మాట్లాడామని వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని అఖిల భారత పారిశ్రామిక గ్యాస్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు తెలిపారు.

ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రధేశ్‌, రాజస్థాన్‌ల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తున్నారు. వీరిని నిలువరించడానికి ఢిల్లీ ప్రభుత్వం బారికేడ్లు ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ట్రక్కులను, జేసీబీలను సైతం అడ్డుపెట్టింది. దారులన్నీ మూసుకుపోవడంతో శుక్రవారం  హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రావల్సిన లిక్విడ్ ఆక్సిజన్‌ ట్రక్కులు ఢిల్లీకి చేరుకోలేదు.‌ ఢిల్లీలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ లేకపోవడంతో పక్కనే ఉన్న హరియాణా, యూపీ, రాజస్థాన్‌ల నుంచి తెప్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు