మాస్క్‌ లేకుంటే కొరడా

23 Nov, 2020 04:31 IST|Sakshi

కరోనా నేపథ్యంలో జరిమానాలు

గుజరాత్‌లో 5 నెలల్లో రూ. 78 కోట్ల ఆదాయం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాలని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మాస్క్‌లు ధరించని వారికి విధిస్తున్న జరిమానాల విషయంలో నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ పెరగడంతో మాస్క్‌ ధరించని వారికి విధించే జరిమానా రూ. 500 నుంచి రూ.2000కు పెంచారు.  

గుజరాత్‌లో భారీగా జరిమానాలు వసూలు
కరోనాను కట్టడి చేసేందుకు జరిమానాలు విధించడంలో గుజరాత్‌ అధికారులు ఇతర రాష్ట్రాల కంటే కాస్త ముందున్నారు. జూన్‌ 15 నుంచి ఇప్పటì వరకు రాష్ట్రంలో మాస్క్‌లు ధరించనివారికి అధికారులు చలాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు 26 లక్షల మంది ప్రజల నుంచి రూ.78 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఈ మొత్తం స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ సంవత్సరపు ఆదాయం కంటే ఎక్కువ అని అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని కెవాడియాలో 2018 అక్టోబర్‌ 31న ఏకతా విగ్రహాన్ని ప్రారంభించారు. దీని తరువాత, పర్యాటకుల నుంచి ఏడాదిలో రూ. 63.50 కోట్ల ఆదాయం వచ్చింది.

అత్యధికంగా అహ్మదాబాద్‌లో ప్రతి నిమిషానికి అత్యధికంగా 120 మందికి జరిమానా విధించారు. అధికారులు నిరంతరం సూచనలు  చేస్తున్నప్పటికీ చాలామంది ప్రజలు ఇప్పటికీ మాస్క్‌లు ధరించట్లేదు. మాస్క్‌లు ధరించని ప్రజలకు జరిమానా మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌ సైతం వచ్చింది. మాస్క్‌ ధరించకుండా దొరికితే గుజరాత్‌లో తప్పనిసరిగా కరోనా పరీక్ష చేస్తున్నారు. ఒకవేళ రిపోర్ట్‌ పాజిటివ్‌గా వస్తే రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక వారిని వెంటనే ఆసుపత్రికి చికిత్స కోసం పంపిస్తారు.

45 వేల కొత్త కేసులు
దేశంలో 24 గంటల్లో 45,209 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.95 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 501 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఆదివారానికి 85,21,617కు చేరుకుంది.  యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,40,962గా ఉంది. కాగా, ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో మంగళవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్‌ అంశంపైనే రెండు సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు