సరైన స్పందన కరువు

9 Oct, 2022 06:21 IST|Sakshi

లేవనెత్తిన సమస్యల విషయంలో ఆప్‌ సర్కార్‌ తీరుపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీ, విద్యుత్‌ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ సర్కార్‌ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్‌(ఎల్‌జీ) గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్‌ సర్కార్‌ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్‌కు రాసిన మరో లేఖలో ఎల్‌జీ అసంతృప్తి వ్యక్తంచేశారు.

‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్‌ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్‌ సర్కార్‌ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్‌ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్‌జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. ‘ నాకు ఎల్‌జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్‌జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించడంతో ఎల్‌జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు.

మరిన్ని వార్తలు