Delhi liquor Scam: ఈడీ దూకుడు.. రెండో చార్జిషీట్‌ దాఖలు..

6 Jan, 2023 19:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం రెండో చార్జిషీట్‌ దాఖలు చేసింది. 13,657 పేజీలతో కూడిన ఈ అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్‌లో 12 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను ప్రస్తావించింది. గతంలో ఈడీ అరెస్ట్‌ చేసిన విజయ్‌ నాయర్‌, శరత్‌రెడ్డి, బినోయ్‌ బాబు, అభిషేక్‌ బోయినపల్లి, అమిత్‌ అరోరా పేర్లతోపాటు మరో ఏడు కంపెనీలపై అభియోగాలు మోపింది. అయితే ఈ చార్జిషీట్‌లోనూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పేరు చేర్చకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఈడీ అధికారులు శనివారం కోర్టుకు సమర్పించనున్నారు.

కాగా, ఇప్పటికే గత ఏడాది నవంబర్‌లో తొలి చార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్రుకు సంబంధించిన చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఇప్పటి వరకు ఈ కేసులో సమీర్‌ మహింద్రు, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, అమిత్ అరోరాలను ఈడీ అరెస్ట్‌ చేసింది. 

ఢిల్లీలో ఇటీవల అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సమీర్‌ మహింద్రు ఒకరు. ఈ కేసులోని నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా పేరు ఈడీ తొలి చార్జిషీట్‌లోనూ చేర్చలేదు. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (బీసీఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మనీష్ సిసోడియా సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది.

ఇదిలా ఉండగా శనివారంతో ఢిల్లీ లిక్కర్‌ కేసు నిందితులైన విజయనాయర్, అభిషేక్ బోయినపల్లి,  శరత్ చంద్రారెడ్డి , బినోయ్‌బాబు జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. జనవరి 7న  శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్‌ కోర్టు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ నిందితులను ప్రవేశపెట్టనుంది.
చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు