సుప్రీంకోర్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు చుక్కెదురు

28 Feb, 2023 17:11 IST|Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్‌ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్ట్‌ విషయంలో తాముజోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. సిసోడియాకు న్యాయపరంగా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పిన ధర్మాసనం.. సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ మేరకు సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

కాగా లిక్కర్‌ కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బెయిల్‌ కోసం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. సిసోడియా పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.  దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ ఛార్జిషీట్‌లో మనీష్‌ సిసోడియా పేరు లేనందున అతని అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక దర్యాప్తుకు సిసోడియా సహకరించడం లేదంటూ సీబీఐ చేస్తోన్న అరోపణలు బలహీనమైన సాకుగా కనిపిస్తోందన్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐ అరెస్టును సవాల్‌ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించారు.

‘జర్నలిస్ట్‌ వినోద్‌ దువా కేసుకు.. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అది వాక్‌ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించినది.  సిసోడియా కేసు అవినీతి ఆరోపణలకు సంబంధించినది.  ఇది తప్పుడు ఉదాహరణగా నిలుస్తుంది. కేవలం మీరు ఢిల్లీలో ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదు. సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి, కానీ ప్రస్తుత పరిస్థితిలో మాత్రం దీనిని విచారించేందుకు మేము సిద్ధంగా లేము. హైకోర్టుకు వెళ్లండి’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.  దీంతో సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ హైకోర్టు తలుపులు తట్టనుంది.

మరిన్ని వార్తలు