ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బిగ్‌ ట్విస్ట్‌.. అప్రూవర్‌గా దినేష్‌ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు!

7 Nov, 2022 17:54 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్‌ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు. దినేష్‌ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ క్రమంలో దినేష్‌ అరోరా వాంగ్మూలం నమోదు చేసింది ధర్మాసనం. ఎవరైనా బెదిరించారా, ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? అని దినేష్‌ అరోరాను సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. కేసులో తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. 

కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేష్‌ అరోరాకు గత వారమే ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ సమయంలో సీబీఐ అభ్యంతరం చెప్పకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో దినేష్‌ను సాక్షిగా చూడాలని కోరుతూ సోమవారం సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులకు దినేష్‌ సహకరిస్తున్నారని, ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అందించారని కోర్టుకు తెలిపింది.

మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్టయ్యారు. అందులో అరోరా ఒకరు. ఈ కేసులో మరో నిందితుడు సమీర్‌ మహేంద్ర.. రాధా ఇండస్ట్రీస్‌ ఖాతా నుంచి రూ.కోటి బదిలీ చేసినట్లు సీబీఐ తేల్చింది. రాధా ఇండస్ట్రీస్‌ దినేష్‌ అరోరాకి చెందినది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, దినేష్‌ అరోరా సహా నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 120బీ, 477ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7కింత సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో దినేష్‌ అరోరా అప్రూవర్‌గా మారినట్లు సీబీఐ ప్రకటించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. 

ఇదీ చదవండి: వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి

మరిన్ని వార్తలు