లిక్కర్‌ కేసు: సిసోడియా కస్టడీ పొడగింపులో మార్పు, ఈడీ మరో ఛార్జిషీట్‌!

17 Apr, 2023 15:18 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యూడీషియల్‌ కస్టడీని పొడిగించింది ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు. అయితే.. తొలుత మే 1వ తేదీ వరకు సిసోడియా కస్టడీని పొడగిస్తున్నట్లు తెలిపిన కోర్టు.. కాసేపటికే ఆ ఆదేశాలను మార్చేసింది. 

లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులతో దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సీబీఐ కేసులో సిసోడియా కస్టడీని ఏప్రిల్‌ 27వ తేదీకి, ఈడీ కేసులో ఏప్రిల్‌ 29వ తేదీ దాకా కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్‌ అయిన హైదరాబాదీ వ్యాపారవేత్త  అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీని మాత్రం మే 1వ తేదీ వరకే పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

లిక్కర్‌ కేసులో సీబీఐ అవినీతి అభియోగాల మీద, ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవినీతి అభియోగాల మీద ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసింది.  మరోవైపు లిక్కర్‌ స్కాంలో ఈ నెలాఖరులోగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరో ఛార్జిషీట్‌ (ప్రాసిక్యూషన్ ఫిర్యాదు) దాఖలు చేయనున్నట్లు సమాచారం. సిసోడియా, పిళ్లై, మరో వ్యాపారవేత్త అమన్‌దీప్ ధాల్‌ అదనపు ఛార్జీషీట్‌ వేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు