సీఎం కేజ్రీవాల్‌కు లిక్కర్‌ స్కామ్‌ సెగ.. ఢిల్లీలో పెద్ద ఎత్తున నిర‌స‌నలు, ఉద్రిక్తత

4 Feb, 2023 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. మద్యం కుంభకోణంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరు రావడంతో ఆయన వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్‌ అవినీతికి పాల్పడినట్లు రుజువైందని ఆరోపిస్తూ.. సీఎం పదవికి రాజీనామా చేయాలని నిరసనలు వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఆప్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిరసనకారులు లోపలికి రాకుండా భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బారికేడ్లను  దూకేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో.. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరికొందరు సీఎంకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని.. కేజ్రీవాల్ 'చోర్‌ చోర్‌' అంటూ నినాదాలు చేశారు.

కాగా మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో బీజేపీ సీఎం కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేసింది. ఈడీ సమర్పించిన చార్జ్‌ షీట్‌ను ఢిల్లీ కోర్టు అంగీకరించింది. అయితే ఈడీ ఆరోపణలను సీఎం కేజ్రీవాల్‌ ఖండించారు. దర్యాప్తు సంస్థల సాయంతో కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్మించారు. 
చదవండి: స్నేహితుల కళ్లదుటే ఘోరం.. 6వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి

>
మరిన్ని వార్తలు