Delhi Liquor Scam: అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో అతడి విచారణ.. మరిన్ని అరెస్టులకు ఛాన్స్‌!

12 Oct, 2022 13:22 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ బోయినపల్లి అభిషేక్‌ విచారణ కొనసాగుతోంది. 

అభిషేక్‌ Abhishek Boinpally ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసులో  ఏ9 నిందితుడు, ఢిల్లీ వ్యాపారి అమిత్‌ అరోరాను సీబీఐ ప్రశ్నిస్తోంది. వాహలా రూపంలో నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది సీబీఐ. ఈ క్రమంలో.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.

లిక్కర్‌ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్‌ పాండేకు విజయ్‌ నాయర్‌ తరపున సమీర్‌ మహేంద్రు(సహ నిందితుడు) ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్‌ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు.

కాగా అభిషేక్‌కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. అదే సమయంలో.. ఈ కుంభకోణంలో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనేది ఆరోపణలు వినవస్తున్నాయి.

మరిన్ని వార్తలు