Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌ కేసులో మరో అరెస్ట్.. ఈసారి మాజీ ఎమ్మెల్యే కొడుకు!

8 Feb, 2023 12:07 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌ కేసులో దర్యాప్తు సంస్థల దూకుడుతో తేనె తుట్టె కదులుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ, తెలంగాణాకు చెందిన వ్యక్తులను అరెస్టు చేయగా తాజాగా పంజాబ్ కు చెందిన మల్హోత్రా అరెస్ట్‌ అయ్యాడు. బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్  గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇవాళ అరెస్ట్‌ చేసింది. 

లిక్కర్‌ స్కామ్‌లో గౌతమ్‌ మల్హోత్రా ప్రమేయంపైనా ఓ స్పష్టత వచ్చింది. గౌతమ్ మల్హోత్రా పంజాబ్‌కు చెందిన వ్యక్తి. ఇతని తండ్రి దీపక్ మల్హోత్రా శిరోమణి అకాళీదళ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే. అంతేకాదు.. మద్యం తయారీ వ్యవహారాల్లో నిమగ్నమైన ఓయాసిస్‌ గ్రూప్‌ ‍వ్యవహారాలను సైతం గౌతమ్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడు. గౌతమ్‌ వైన్స్‌ పేరుతోనే ఓయాసిస్‌ గ్రూప్‌ మార్కెట్‌లోకి మద్యం తీసుకొస్తోంది. 

మద్యం కుంభకోణంలో గ్రూపులుగా ఏర్పడటంలో గౌతమ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అనుమానిస్తోంది. అక్రమ నగదు తరలింపు, నేరాల్లో నిందితుడుగా వున్న గౌతమ్ మల్హోత్రా.. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విధానాన్ని అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఇక.. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య ఏడుకి చేరింది. ఇప్పటి వరకు సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి,బినయ్ బాబు,అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్,అమిత్ అరోరా.. తాజాగా గౌతమ్ మల్హోత్రా ను అరెస్ట్ చేసింది ఈడీ. మనీ లాండరింగ్ ,అక్రమ నగదు తరలింపు వ్యవహారాల పై దర్యాప్తు జరుపుతోంది. మద్యం కంపెనీలకు,వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేసినందుకు గాను 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు విజయ్ నాయర్ ద్వారా ఇచ్చినట్లు నిందితులపై ఆరోపణలు నమోదు అయ్యాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ పాలసీ ముడుపులను ఖర్చు చేసినట్లు ఇటీవల సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో పేర్కొంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.
 

మరిన్ని వార్తలు