మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు.. కోర్టులో ఈడీ

10 Mar, 2023 15:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియాను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈ కేసు విచారణకు ఆయనను 10 రోజులు రిమాండ్‌కు అప్పగించాలాని కోరారు. ఈ సందర్భంగా కోర్టులో వాడీవేడీగా వాదనలు సాగాయి. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు దయన్ కృష్ణన్, సిద్ధార్థ్ అగర్వాల్, ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హొస్సేన్  వాదనలు విన్పించారు.

ఈ సందర్బంగా జోహెబ్ వాదిస్తూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయ్‌ నాయర్, సిసోడాయా, కల్వకుంట్ల కవితతో పాటు పలువురు కుట్ర పన్నారని కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్‌.. ఆప్ నేతలకు దాదాపు రూ.100 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో 30 శాతం మద్యం వ్యాపారాన్ని సౌత్ గ్రూప్‌కి ఇచ్చినట్లు వివరించారు.

'కే కవితను  విజయ్ నాయర్‌  కలిశారు. పాలసీ ఎలా ఉందో చూపాలని విజయ్‌ను కవిత అడిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తరపున విజయ్ నాయర్ వ్యవహరిస్తున్నారు.పాలసీ విధానాలు GOM నివేదికను మంత్రుల కన్నా  రెండు రోజుల ముందు బుచ్చిబాబుకి కవిత ఇచ్చారు. ఇండోస్పిరిట్స్  కంపెనీకి L1 లైసెన్స్‌ని ఇప్పించడంలో సిసోడియా పాత్ర ఉంది. లిక్కర్ పాలసీ తయారీలో కీలక పాత్ర మనీష్ సిసోడియాది. లిక్కర్ వ్యాపారం మొత్తం కొంతమందికే కట్టబెట్టారు. లిక్కర్ బిజినెస్‌లో సౌత్ గ్రూప్ పాత్ర ఉంది. 12 శాతం మార్జిన్ తో హోల్ సేలర్స్‌కి లాభం వచ్చేలా కొత్త పాలసీలో మార్పులు చేశారు.

కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హోల్‌సేల్ వ్యాపారం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ విధానాన్ని అమలు చేశారు. పాలసీ తయారు చేశాక కొంత మంది ప్రవేట్ వ్యక్తులకు పంపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు బయటకు ఎలా వచ్చాయి?. సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా మద్యం విధానంలో మార్పులు చేశారు. కేవలం కంటి తుడుపు చర్యగా ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలకు భారీ ప్రయోజనాలు కలిపించే విధంగా మద్యం పాలసీ రూపకల్పన చేశారు. మొత్తం కుట్రను సమన్వయం చేసేది విజయ్ నాయర్. ఈ స్కామ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులు , రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక శాఖలు ఉన్నాయి.


సంజయ్ సింగ్ (ఆప్ ఎంపీ) అరోరాకు ఫోన్ చేసి పార్టీ ఫండ్ గురించి మాట్లాడారు. లిక్కర్ వ్యాపారం మొత్తం కొంతమందికే కట్టబెట్టారు. ఏడాది వ్యవధిలో 14 ఫోన్లు ధ్వంసం చేశారు. సిసోడియా కొనుగోలు చేసిన ఫోన్‌లలో, తన పేరు మీద లేని సిమ్‌కార్డులను ఉపయోగించారు. అతను ఉపయోగించిన ఫోన్ కూడా అతని పేరు మీద లేదు. జెట్ స్పీడుతో ఇండోస్పిరిట్స్ దరఖాస్తు క్లియర్ అయింది. మనీశ్ సిసోడియా 14 ఫోన్లు ఉపయోగించారు. కేవలం 2 మాత్రమే రికవర్ అయ్యాయి.' అని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అనంతరం వాదనలు విన్న న్యాయస్థానం ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. సిసోడియాను 10 రోజుల కస్టడీకి(మార్చి 17 వరకు) అనుమతి ఇచ్చింది. దీంతో అధికారులు మరో 10 రోజుల పాటు ఆయనను విచారించనున్నారు. కాగా.. సిసోడియాను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఆప్ కార్యక్తరలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
చదవండి: దూకుడు పెంచిన ఈడీ.. బిహార్‌ డిప్యూటి సీఎంకు షాక్‌!

మరిన్ని వార్తలు