Delhi Liquor Scam Case: జ్యుడిషియల్ రిమాండ్‌కు గౌతమ్‌ మల్హోత్రా

15 Feb, 2023 15:16 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన పంజాబ్‌ వ్యాపారవేత్త గౌతమ్‌ మల్హోత్రాను జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఈ మేరకు బుధవారం రిమాండ్‌ విధించింది  రౌస్ ఏవిన్యు స్పెషల్ కోర్టు. 

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇటీవలే గౌతమ్‌ మల్హోత్రాని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. అయితే నేటితో కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది కోర్టు. బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన గౌతమ్ మల్హోత్రా.. మద్యం కుంభకోణంలో గ్రూపులుగా ఏర్పడటంలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు ఉన్నాయి. 

అంతేకాదు.. మద్యం తయారీ వ్యవహారాల్లో నిమగ్నమైన ఓయాసిస్‌ గ్రూప్‌ ‍వ్యవహారాలను సైతం గౌతమ్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడు. గౌతమ్‌ వైన్స్‌ పేరుతోనే ఓయాసిస్‌ గ్రూప్‌ మార్కెట్‌లోకి మద్యం తీసుకొస్తోంది. ఇక అక్రమ నగదు తరలింపు, నేరాల్లో నిందితుడుగా వున్న గౌతమ్ మల్హోత్రా.. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విధానాన్ని అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇతని తండ్రి దీపక్ మల్హోత్రా శిరోమణి అకాళీదళ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే.

మరిన్ని వార్తలు