Manish Sisodia: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. విచారించనున్న సీజేఐ చంద్రచూడ్

28 Feb, 2023 12:16 IST|Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. సిసోడియా పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నేటి మధ్యాహ్నం 3.50 గంటలకు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం వెల్లడించింది.

సిసోడియా అరెస్టు, మద్యం పాలసీ కేసులో సీబీఐ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సీజేఐ ముందు కేసును ప్రస్తావించనున్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆదివారం సీబీఐ అధికారులు మనీష్‌సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.  ఎనిమిది గంటలపాటు సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా చెప్పడం లేదని డిప్యూటీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం సోమవారం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను విచారించాల్సి ఉందని... తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు.. సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆయన సుప్రీం మెట్లెక్కారు. మరోవైపు సిసోడియా అరెస్టును వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉపయోగిస్తోందని విమర్శించాయి. 

మరిన్ని వార్తలు