Delhi Liquor Scam: విచారణకు రాలేనన్న కవిత.. కుదరదన్న ఈడీ

16 Mar, 2023 12:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. తన న్యాయవాది ద్వారా సమాచారం పంపారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఈడీకి 6 పేజీల లేఖ రాశారు.

'కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయండి. మహిళను ఈడి ఆఫీస్ కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్ లో ఉంది. చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే నాకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటాను. నా ప్రతినిధి సోమా భరత్ ద్వారా నా బ్యాంక్ స్టేట్మెంట్ సహా మీరు అడిగిన పత్రాలు పంపుతున్నాను.' అని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.

అయితే కవిత విజ్ఞప్తికి ఈడీ డైరెక్టర్‌ అంగీకరించలేదు. విచారణకు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో కవిత ఇవాళ విచారణకు వెళ్తారా లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆమె వెళ్లకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు రేపటితో ఈ కేసులో ఇద్దరు కీలక నిందితుల ఈడీ కస్టడీ ముగియనుంది. మనీశ్ సిసోడియా, అరుణ్ చంద్ర పిళ్లై, బుచ్చిబాబులను ఎదురుగా పెట్టి కవితను ఈడీ విచారించాలనుకుంది.  దీంతో ఈ ముగ్గురి కస్టడీ ముగిశాకే విచారణకు హాజరుకావాలని కవిత వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజీపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్‌ సర్వే వైరల్‌

మరిన్ని వార్తలు