Delhi Liquor Scam: 16న మళ్లీ రావాలి.. కవిత ఈడీ విచారణలో ఏం జరిగింది?

11 Mar, 2023 21:56 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని బృందం కవితను విచారించింది. ఈ కేసులో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై కూడా విచారణ జరిగినట్లు తెలిసింది. ఆరుణ్‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్టు, ఆడిటర్‌ బుచ్చిబాబు వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. పీఎంఎల్‌ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్‌ రికార్డు  చేసినట్టు  సమాచారం.

ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించింది. సౌత్ గ్రూఫ్ నిధులు, మద్యం కుంభకోణం, వీటితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో గతంలో జరిగిన భేటీలు లాంటి అంశాలపై కవితను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

విచారణ మధ్యలో సాయంత్రం విరామ సమయం ఇచ్చి.. అనంతరం తిరిగి విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో ​కవితను దాదాపు 9 గంటలపాటు ఈడీ అధికారులు విచారణ కొనసాగింది. ఈ నెల 16న కవిత మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

చదవండి: బంపరాఫర్‌! ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌.. తెలంగాణ ప్రభుత్వ చర్యలు

మరిన్ని వార్తలు