కాఫీ షాప్‌ పార్కింగ్‌ ఆఫర్‌..రూ 60 కోసం పదేళ్లు​ పోరాడి గెలిచాడు

2 Apr, 2023 10:56 IST|Sakshi

వినియోగాదారుల హక్కుల ప్రాముఖ్యత, దాని కోసం నిలబడి పోరాడేలని చెప్పే అంశం దేశ రాజధాని ఢిల్లీలో తెరపైకి వచ్చింది. అదీకూడ ఒక చిన్న మొత్తం కోసం పోరాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసినా.. మన హక్కులను గుర్తు చేయడమే గాక కొన్ని ఆఫర్‌లు మనల్నీ ఎలా నిలువు దోపిడి చేస్తున్నారో ప్రపంచానికి తెలిసేలా చేసింది ఈ ఘటన. వివరాల్లోకెళ్తే..కమల్‌ ఆనంద్‌  తన భార్యతో కలిసి సాకేత్‌లోని ఒక మాల్‌లో కోస్టా కాఫీ అవుట్‌లెట్‌కి వెళ్లారు. అవుట్‌లెట్‌ ఉద్యోగి వారికి ఒక ఆఫర్‌ ఇచ్చాడు. కాఫీ ఆర్డర్‌ చేస్తే పార్కింగ్‌ ఉచితం అని వారికి తెలియజేశాడు. దీంతో కమల్‌ రెండు కాఫీలు కొనుగోలు చేసి రూ.570 చెల్లించాడు. తదనంతరం అతను తన భార్యతో కలిసి పార్కింగ్‌ స్థలం నుంచి బయటకు రాగానే రూ. 60 చెల్లించమని పార్కింగ్‌ నిర్వాహకుడు అడిగాడు.

అతను ఆఫర్‌ స్లిప్‌ను చూపించాడు. ఐతే అక్కడున్న వ్యక్తి ఆ ఆఫర్‌ గురించి ఎలాంటి సమాచారం లేదని పార్కింగ్‌కి డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేశాడు. ఈ విషయమై కోస్టా కాఫీ నిర్వాహకులకు, మాల్‌ యజమానికి ఫిర్యాదు చేసినప్పటికీ..లాభం లేకుండా పోయింది. పైగా నిర్వాహకులు పార్కింగ్‌ డబ్బులు వసూలు చేశారు కూడా. దీంతో ఆనంద్‌ ఢిల్లీలోని వినయోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ సుమారు పదేళ్లు సాగింది. ఐతే విచారణ సమయంలో ఆనంద్‌ తన ఫిర్యాదుకు మద్దతుగా తగిన సాక్ష్యాధారాలను కోర్టుకి సమర్పించాడు.

అయితే ఆనంద్‌ వాదనను ఎదుర్కోనేలా ప్రతివాది ఎటువంటి ఆధారాలను సమర్పించ లేకపోయాడు. దీంతో కోర్టు ఇది కేవలం రూ. 60కి సంబంధించినది కాదని వినియోగదారుల హక్కులకు వారు పొందాల్సి సౌకర్యాలకు సంబంధించిందని పేర్కొంది. కస్టమర్‌ను ఆఫర్‌తో ప్రలోభ పెట్టి ఆపై కస్టమర్‌ విపత్కర స్థితిలో చిక్కుకున్నప్పుడూ ఆ ఆఫర్‌ తిరస్కరించటం సర్వీస్‌లో నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంత చిన్న మొత్తం అయినా వెనుకడుగు వేయక జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డందుకు ఆనంద్‌ని కోర్టు ప్రశంసించింది. అంతేగాదు కోర్టు ఈ కేసులో నిందితులకు రూ.61,201 జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కమల్‌కి చెల్లించాలని స్పష్టం చేసింది.    

(చదవండి: 'ప్రేమలో పడండి' అంటూ విద్యార్థులకు సెలవులు మంజూరు)

మరిన్ని వార్తలు