ఢిల్లీలో బీజేపీకి బ్రేక్‌.. ఫలించిన కేజ్రీవాల్‌ ప్లాన్స్‌

7 Dec, 2022 19:47 IST|Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ 15 ఏళ్ల జైత్రయాత్రకు బ్రేకులు వేసింది ఆప్‌. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ విజయధుందుబి మోగించింది. మొత్తం 250 స్థానాలకు గానూ అవసరమైన మెజారిటీ 126 కాగా.. 134 సీట్లు సాధించింది. మరోవైపు.. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 09 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 3 స్థానాలు గెలుపొందారు.  

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌. ‘​ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను కేజ్రీవాల్‌ కూకటివెళ్లతో పెకిలించారు. ఇప్పుడు ఎంసీడీలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించారు. విధ్వేషపూరిత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు కోరుకోవటం లేదని ఈ ఎన్నికలు చెబుతున్నాయి. వారు పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్తు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశారు’ అని పేర్కొన్నారు పంజాబ్‌ సీఎం. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆప్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్‌ మాదిరిగా మఫ్లర్‌, టోపీ ధరించిన చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ)లోని మొత్తం 250 వార్డులకు డిసెంబర్‌ 4న పోలింగ్‌ జరిగింది. 1349 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి సీఎం షీలా దీక్షిత్‌ మూడు కార్పొరేషన్లుగా విభజించారు. తర్వాత తిరిగి 2022లో వాటిని విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు గెలుపొందగా.. ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 స్థానాలు గెలుచుకున్నాయి. 

అప్డేట్‌ 12:55PM
విజయం దిశగా ఆప్‌.. 106 స్థానాలు కైవసం
ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం దిశగా ఆప్‌ దూసుకెళ్తోంది. ఇప్పటికే 106 స్థానాలు కైవసం చేసుకుంది. మరో 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆప్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 126కు మంచి సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తు చేస్తున్నారు. 

అప్డేట్‌ 11:55AM
ఢిల్లీ కార్పొరేషన్‌(ఎంసీడీ) ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. 250 వార్డులకు కౌంటింగ్‌ జరుగుతుండగా ఇప్పటి వరకు 75 స్థానాల్లో విజయం సాధించింది. మొదటి నుంచి హోరాహోరీ పోటీ కొనసాగినప్పటికీ బీజేపీ కాస్త వెనకబడింది. ప్రస్తుతం 55 స్థానాలను కైవసం చేసుకుంది కాషాయ పార్టీ. ఇంకా ఆప్‌ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 48 వార్డుల్లో ముందంజలో ఉంది. 

తొలి ట్రాన్స్‌జెండర్‌
ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శస్తోంది. మరోవైపు.. ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్‌ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది. 

అప్డేట్‌ 10:25AM
ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ, ఆప్‌ పార్టీలు తలో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు.. ఇరు పార్టీలు 112 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ 12, స్వతంత్రులు 4, బీఎస్‌పీ, ఎన్‌సీపీలు ఒక్కోస్థానంలో ముందంజలో ఉన్నాయి. 

అప్డేట్‌ 10:00AM
హోరాహోరీ
ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠగా సాగుతోంది. నిమిష నిమిషానికి ఆధిక్యం తారుమారవుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆప్‌ 109, బీజేపీ 105, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీ కార్పొరేషన్‌(ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. ఢిల్లీ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం 250 వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ప్రస్తుతం బీజేపీ 110, ఆప్‌ 100, కాంగ్రెస్‌ 9, ఎన్సీపీ 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

మరోవైపు.. తమ పార్టీ 180 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌. తమ పార్టీ నుంచే మేయర్‌ ఎన్నికవుతారని తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలే నిజం కాబోతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Delhi MCD Exit Poll 2022: టాప్‌లో ఆప్‌.. బీజేపీ మెరుగైన ప్రదర్శన.. మరి కాంగ్రెస్‌?

మరిన్ని వార్తలు