వీడియో: హోంవర్క్‌ చేయలేదని కాళ్లుచేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో విలవిలలాడిన బిడ్డ

8 Jun, 2022 18:44 IST|Sakshi

కాళ్లు చేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో చిన్నారిని పడుకోబెట్టారు. భరించలేక ఆ బిడ్డ విలవిలలాడిపోయింది. చివరికి బాధతో రోదించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఈమధ్య ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అయ్యింది. అయితే ఈ వీడియో ఎక్కడ? ఎందుకు? జరిగిందనే విషయాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. 

ఢిల్లీ ఖాజూరీ ఖాస్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కూతురు హోం వర్క్‌ చేయకపోవడంతోనే అలాంటి శిక్ష విధించానని ఆ చిన్నారి కన్నతల్లి చెబుతోంది. అయితే ఐదు పదినిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని ఆమె ఘటనపై వివరణ ఇచ్చింది. 

జూన్‌ 2వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కరావాల్‌ నగర్‌ నుంచి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యింది.  ఈ ఘటనను పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. ఆపై స్థానికంగా ఆ ఘటన ఎక్కడా జరగలేదని పోలీసులు కన్ఫర్మ్‌ చేసుకున్నారు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వ్యక్తి.. ఘటన సమయంలో పక్కనే ఉన్న బిల్డింగ్‌లో నుంచి వీడియో తీసినట్లు తేలింది. అతని ద్వారా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోను చేధించారు. 

ఇక ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. ఆ తల్లికి కూడా అలాంటి శిక్షే విధించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఈ ఘటనలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు