Delhi MCD Election: బీజేపీకి 20 సీట్లే.. కేజ్రీవాల్‌ ప‌ది కీల‌క హామీల ప్రకటన

11 Nov, 2022 15:25 IST|Sakshi

న్యూఢి: ఢిల్లీ మున్సిపల్‌ ​‍కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ రాష్ట్ర ప్రజలకు పలు కీలక హామీలు ప్రకటించారు. పౌర సంస్థలో అవినీతిని నిరోధించడం, చెత్త డంపింగ్‌ యార్డ్‌ల తరలింపు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలతో సహా పది హామీలు అందించారు. తమ పార్టీ ఏం చెబుతుందో.. అదే చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు.

రాజధాని వాసులు ఆప్‌కు ఓటు వేస్తే ఢిల్లీలో పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఢిల్లీ సీఎం తెలిపారు. రోడ్లను బాగుచేస్తామని, ఎంసీడీ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగుపరుస్తామని వాగ్దానం చేశారు. అలాగే పౌర సంస్థలోని ఉద్యోగులకు సకాలంలో జీతం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌ను తొలగించి సీల్‌ చేసిన దుకాణాలను తిరిగి తెరిపిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.
చదవండి: ‘పాత పింఛను’ హామీ ఎన్నికల స్టంట్‌ కాదు

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించిన వచన్‌ పత్రపై ఢిల్లీ సీఎం ఫైర్‌ అయ్యారు. దీనినే వచ్చే ఎన్నికల్లో వారు సంకల్ప్‌ పత్రా అని పిలుస్తారని..ఎన్నికల తరువాత తమ వాగ్దానాలు, మ్యానిఫెస్టోలను పట్టించుకోరని, చెత్తబుట్టలో పారేస్తారని విమర్శించారు. 

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించడం లేదని బీజేపీ ఆరోపిస్తోందని.. నిధులు కేటాయించడం లేదని కేంద్రం ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం  చరిత్రలోనే ఇది తొలిసారని మోదీ సర్కార్‌పై మంపడిపడ్డారు. చెత్త రహిత నగరంగా ఢిల్లీని మార్చేందుకు కేంద్రం నుంచి నిధులు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. కానీ తన మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు రావని ఢిల్లీ సీఎం జోస్యం చెప్పారు.

కాగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 250 వార్డులు ఉన్నాయి. వీటికి డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 7వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ, ఆప్‌ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.

మరిన్ని వార్తలు