'మా భాషను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే'

6 Jun, 2021 15:46 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీలోని గోవింద్‌ బల్లబ్‌ పంత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌) వ్యవహరించిన తీరుపై ఢిల్లీ మలయాళీ నర్సుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిప్‌మర్‌లో పనిచేసే మలయాళీ నర్సులు మలయాళం మాట్లాడకూడదని.. కేవలం ఇంగ్లీష్‌ లేదా హిందీలో మాత్రమే సంభాషించాలంటూ సర్య్కులర్‌ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నర్సుల సంఘం ఇలా చేయడం మా భాషను అవమానించడం అవుతుందని.. ఇది తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తూ వెంటనే లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. 

ఇక జూన్‌ 5న(శనివారం)జిప్‌మర్‌ ఆసుపత్రి ఈ సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిసింది. మలయాళం మాట్లాడేందుకు వీల్లేదని.. కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడాలని సర్య్కులర్‌లో పేర్కొన్నారు. అయితే జిప్‌మర్‌ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి ముందస్తు సూచన ఇవ్వకుండానే సర్య్కులర్‌ బయటికి వచ్చిందని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ సర్క్యులర్‌ను విత్‌ డ్రా చేశామని వివరించారు.

ఇదే విషయమై ఢిల్లీ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ మలయాళీ నర్సర్‌ ప్రతినిధి సీకే ఫమీర్‌ స్పందించాడు.  " ఈ విషయం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. జిప్‌మర్‌ జారీ చేసిన సర్క్యులర్‌ చూస్తుంటే మా భాషా స్వేచ్ఛకు ముప్పు ఉన్నట్లు భావిస్తున్నాము. వారు భాషను కించపరిచి మా రాష్ట్రాన్ని అవమానించారు. వెంటనే సర్క్యులర్‌ జారీ చేసిన సంబంధిత వ్యక్తి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది . అయితే జిప్‌మర్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఈ విషయం మాకు తెలియడం అనేది విషయాన్ని మరింత సీరయస్‌గా తయారు చేసింది. అధికారులకు కనీస సూచనలు లేదా వారి అనుమతి లేకుండానే సర్క్యులర్‌ జారీ చేసిన వ్యక్తిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకునే వరకు తాము ధర్నాను కొనసాగిస్తాం.'' అని చెప్పుకొచ్చారు.

కాగా నర్సుల యూనియన్‌ ఆందోళనపై స్పందించిన జిప్‌మర్‌ మెడికల్‌ డైరెక్టర్‌ అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. '' మాకు తెలియకుండా ఇచ్చిన సర్య్కులర్‌ను విత్‌డ్రా చేసుకున్నాం. ఆ సర్క్యులర్‌ జారీ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీ ఆందోళనను విరమించి విధుల్లో చేరాలని కోరుతున్నాం'' అంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చదవండి: Mumbai: తెలుగువారి కోసం కరోనా టీకా 

మరిన్ని వార్తలు