Delhi Pandav Nagar Murder: శ్రద్ధా వాకర్‌ కంటే భయానకమైన కేసు ఇది!

28 Nov, 2022 17:25 IST|Sakshi

దేశ రాజధానిలో మరో ఘోర హత్యోదంతం కలకలం సృష్టించింది. తూర్పు ఢిల్లీలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను ఘోరంగా కడతేర్చిన ఉదంతం ఐదు నెలల తర్వాత వెలుగు చూసింది. అదృశ్యమై నెలలు గడుస్తున్నా ఆ వ్యక్తి ఆచూకీ గురించి కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం, అప్పటికే దొరికిన ఓ శరీరపు విడిభాగాల కేసు మిస్టరీ వీడకపోవడం.. ఈ క్రమంలో జరిగిన దర్యాప్తు ద్వారా కేసు చిక్కుముడి వీడింది. శ్రద్ధా వాకర్‌ తరహా హత్యోదంతంగా రికార్డు అయిన ఈ కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు.


పాండవ్‌ నగర్‌ త్రిలోక్‌పురి ఏరియాకు చెందిన అంజన్‌ దాస్‌ను అతని కుటుంబ సభ్యులే ఘోరంగా హతమార్చారు. గొంతు కోసి చంపి.. ఆపై శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచేసి.. ఆ విడి భాగాలను రాత్రి సమయంలో స్థానికంగా అక్కడక్కడ పడేశారు.  దాస్‌ తీరుతో విసిగిపోయిన అతని భార్య, ఆమె కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడడం గమనార్హం. ఢిల్లీ మెహ్రౌలీ శ్రద్ధా వాకర్‌ హత్యోదంతం కంటే భయానకంగా ఉంది పాండవ్‌ నగర్‌ హత్య కేసు.

కూతుళ్లపై కన్ను!
అంజన్‌ దాస్‌ మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో అప్పటికే విడాకులైన పూనమ్‌ను రెండో భార్యగా చేసుకున్నాడు.  మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకు కూతుళ్లతో దాస్‌ ఇంట్లోనే ఉంటూ వచ్చింది పూనమ్‌. ఈ క్రమంలో.. దాస్‌ ఏ పని చేయకుండా డబ్బు కోసం పూనమ్‌ కొడుకు దీపక్‌ను వేధిస్తూ వచ్చాడు. అదే సమయంలో దీపక్‌కు వివాహం జరిగింది. దీపక్‌ భార్యతో పాటు పూనమ్‌ కూతుళ్లపైనా అంజన్‌ దాస్‌ కన్నేశాడు. వాళ్లను లైంగికంగా వేధిస్తూ వచ్చాడు.  ఈ విషయాన్ని పూనమ్‌ దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. సరిగ్గా అదే సమయంలో..

పూనమ్‌ నగలను అమ్మేసిన దాస్‌.. ఆ డబ్బును మొదటి భార్యకు పంపించాడు. అప్పటికే దాస్‌ తీరుతో విసిగిపోయిన పూనమ్‌.. తన కొడుకు దీపక్‌ దగ్గర గోడు వెల్లబోసుకుంది. దాస్‌ను హతమార్చాలని నిర్ణయించుకుంది. అప్పటికే దాస్‌ తీరు దారుణంగా తయారు కావడం, తన తల్లిని సరిగా చూసుకోకుండా వేధిస్తున్నాడనే కారణంతో ఈ దారుణంలో దీపక్‌ అందుకు సరేనన్నాడు. 

రాత్రంతా రక్తం పోయాక..
మే 30వ తేదీన మద్యం అలవాటు ఉన్న అంజన్‌ దాస్‌కు.. ఆ తల్లీకొడుకులు మత్తుమందు గోళీలు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న దాస్‌ను బాకుతో హతమార్చాడు దీపక్‌. ఆ రాత్రంతా దాస్‌ మృతదేహం నుంచి రక్తం మొత్తం బయటకు పోయేలా చూసుకున్నారు. డ్రైనేజీ గుండా దానిని బయటకు పంపించేశారు. ఇక ఉదయం కల్లా.. రక్తం మొత్తం శరీరం నుంచి బయటకు వచ్చేయడంతో బాడీని పది ముక్కలు చేశారు. వాటిని పాలిథీన్‌ సంచుల్లో ప్యాక్‌ చేసి.. ఫ్రిడ్జ్‌లో భద్రపరిచారు. ఆపై కొన్నాళ్లకు ఆ ముక్కలను అక్కడక్కడ పడేశారు. 

జూన్‌ 5వ తేదీన రామ్‌లీలా మైదాన్‌ వద్ద కొన్ని శరీర భాగాలు పోలీసులకు దొరికాయి. ఆ తర్వాతి మూడు రోజులు రెండు కాల్లు, తొడ భాగాలు, ఒక పుర్రె, ఓ మోచేయి.. ఇలా విడివిడిగా దొరకడంతో ఢిల్లీ క్రైమ్‌ విభాగం అనానిమస్‌ బాడీగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో పాండవ్‌నగర్‌లో ఇంటి ఇంటికి దర్యాప్తు చేపట్టింది. అంజన్‌ దాస్‌ ఇంటి నుంచి వెళ్లిపోయి ఐదారు నెలలు గడుస్తున్నా కుటుంబ ఫిర్యాదు చేయలేదన్న విషయం.. పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో.. సీసీటీవీ ఫుటేజీలపై దృష్టిసారించారు పోలీసులు. చివరికి.. బ్యాగులతో దీపక్‌, అతని వెంట పూనమ్‌ వెంట ఉన్న దృశ్యాలు బయటపడ్డాయి. అలా ఈ కేసు వీడింది. 

అంజన్‌ దాస్‌ తీరును భరించలేకే ఇలా ఘోర హత్యకు పాల్పడినట్లు ఆ తల్లీకొడుకులు ఒప్పుకున్నారు. శవాన్ని ముక్కలు చేసి.. విడిభాగాలను దూరంగా పడేశాక  ఎలాంటి దుర్వాసన రాకుండా ఇంటిని, ఫ్రిజ్‌ను శుభ్రం చేశామని తెలిపారు. ఎవరికీ చెప్పకుండా దాస్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడని వారు ఇరుగుపొరుగు వారికి చెప్పి నమ్మించే యత్నమూ చేశారు.

ఇదీ చదవండి: మరొకరికి శ్రద్ధా వాకర్‌ రింగ్‌ తొడిగి మరీ.. 

మరిన్ని వార్తలు