ఢిల్లీలో కరోనా కట్టడికి ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌’ సిద్ధం

10 Jul, 2021 00:29 IST|Sakshi

డెల్టా ప్లస్, లాంబ్డా వేరియంట్స్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రణాళికలు

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నేతృత్వంలో డీడీఎంఏ కీలక సమావేశం

పరిస్థితిపై అంచనావేస్తూ ఆంక్షలు విధించాలని నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సంక్రమణ నేపథ్యంలో ఒకవేళ థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్‌ – నవంబరులో థర్డ్‌ వేవ్‌ ప్రభావం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఏరకంగా వ్యవహరించాలన్న దానిపై శుక్రవారం జరిగిన కీలక సమావేశంలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఆమోదించింది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సంక్రమణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ వేరియంట్‌ను ఢిల్లీలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులోభాగంగా కరోనా సంక్రమణ సంభవించినప్పుడు, ఎప్పుడు లాక్‌డౌన్‌ విధించాలి...? ఎప్పుడ్‌ అన్‌లాక్‌ చేయాలి..? అనే అంశాలకు సంబంధించిన ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను అనుసరించాలని నిర్ణయించారు. దీని కోసం బ్లూప్రింట్‌ సైతం సిద్ధం చేశారు. 

డీడీఎంఏ సమావేశం..
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్‌–19 మహమ్మారి పరిస్థితి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ నేతృత్వంలో శుక్రవారం 22వ డీడీఎంఏ సమావేశం జరిగింది. ఇందులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, రెవెన్యూ మంత్రి, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌వీకే పాల్, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా, ఐసీఎంఆర్‌ చీఫ్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డెల్టా ప్లస్, లాంబ్డా వంటి కొత్త వేరియంట్ల కారణంగా ఎదురయ్యే పరిణామాలపై కూలంకషంగా చర్చించారు. వ్యాక్సినేషన్, జీనోమ్‌ సీక్వెన్సింగ్, టెస్టింగ్, ట్రాకింగ్, నిఘా వంటి చర్యలను నూతన వేరియెంట్స్‌ వ్యాప్తిని తగ్గించేందుకు అత్యంత ప్రభావవంతమైన దశలుగా సూచించారు. కరోనా సంక్రమణ రేటు, యాక్టివ్‌ కరోనా రోగుల సంఖ్య, ఆసుపత్రులలోని రోగుల సంఖ్య ఆధారంగా ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌’ పనిచేస్తుంది. ఢిల్లీలో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందుతున్న ప్రదేశాలలో ఆంక్షలు విధించనున్నారు. 

ఎలా పనిచేస్తుంది..?
1) ఎల్లో అలర్ట్‌:
ఢిల్లీలో సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులపాటు 0.5 శాతానికి మించి ఉంటే లేదా వారంలో 1,500 కొత్త కరోనా కేసులు నమోదైతే లేదా ఆసుపత్రులలో 500 ఆక్సిజన్‌ పడకలు సగటున వారానికి నిండి ఉంటే ఈ హెచ్చరిక ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో కేసులు తక్కువ సంఖ్యలో ఉంటే, సరి–బేసి ఫార్ములా ప్రకారం మార్కెట్లు, మాల్స్‌లో అత్యవసరంకాని వస్తువులు,సేవల దుకాణాలను ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు తెరవడానికి అనుమతిస్తారు. మూడు కార్పోరేషన్‌ ప్రాంతాల్లో సగం సామర్థ్యంతో వారాంతపు మార్కెట్లు తెరిచేందుకు, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక యూనిట్లు పనిచేయడానికి అనుమతిస్తారు. 

2) అంబర్‌ అలర్ట్‌ ః
సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులు ఒక శాతానికి మించి ఉంటే లేదా వారంలో 3,500 కొత్త కేసులు ఉంటే లేదా వారంలో సగటు ఆక్సిజన్‌ పడకలు 700 కన్నా ఎక్కువ ఉంటే ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో, నిర్మాణ కార్యకలాపాలు అనుమతిస్తారు. మార్కెట్లు, మాల్స్‌లోని దుకాణాలను సరి–బేసి ప్రాతిపదికన ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు తెరవవచ్చు.

3) ఆరెంజ్‌ అలర్ట్‌ ః
కరోనా సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులపాటు 2 శాతానికి మించి ఉంటే లేదా వారంలో 9,000 కొత్త కేసులు నమోదైతే లేదా వరుసగా ఏడు రోజులు ఆసుపత్రిలో సగటున 1000 ఆక్సిజన్‌ పడకలు నిండి ఉంటే ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో కిరాణా, పాలు, కెమిస్ట్‌ వంటి ముఖ్యమైన వస్తువుల దుకాణాలు తప్ప, అన్ని దుకాణాలు, మార్కెట్లు మూసివేస్తారు. మెట్రో సర్వీసులు మూసివేస్తారు. బస్సులు 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో నడిపేందుకు అనుమతిస్తారు. ఆటోలు, క్యాబ్‌లు, ఈ–రిక్షాలు గరిష్టంగా ఇద్దరు ప్రయాణీకులను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. 

4) రెడ్‌ అలర్ట్‌ ః
కరోనా సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులు 5 శాతం మించి ఉంటే లేదా వారంలో 16,000 కొత్త కేసులు నమోదైతే లేదా ఆసుపత్రులు సగటున 3000 ఆక్సిజన్‌ పడకలతో ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం నిండి ఉంటే ఈ సిగ్నల్‌ ప్రభావవంతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, నిర్మాణ కార్యకలాపాలపై కూడా నిషేధం ఉంటుంది. కార్మికులు నిర్మాణ ప్రాంతంలోనే ఉండగలిగితే అవసరమైన వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేయడానికి కర్మాగారాలకు అనుమతి ఉంటుంది.    

మరిన్ని వార్తలు