రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి గ్రీన్‌ సిగ్నల్‌

23 Jan, 2021 19:39 IST|Sakshi
ట్రాక్టర్‌ పరేడ్‌ సన్నాహకాల్లో భాగంగా అమృతసర్‌లో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ

సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతినిచ్చారు. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, మంగళవారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఇందుకు తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు. (చదవండి: రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ.. శాంతిభద్రతల అంశం)

కానీ రైతులతో చర్చల అనంతరం తాజాగా అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు గుర్నం సింగ్‌ చౌదుని మాట్లాడుతూ.. ర్యాలీ సమయంలో కమిటీ నియమనిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో ముందుకు సాగాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ శాంతిభద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీంకోర్టు... ఢిల్లీలోకి ఎవరిని అనుమతించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులేనని ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.  (చదవండి : ‘వాయిదా’కు ఓకే అంటేనే చర్చలు)

>
మరిన్ని వార్తలు