సంపన్నులను దోచి.. పేదలకు పంచి.. ఢిల్లీలో ‘రాబిన్‌ హుడ్‌’ ముఠా గుట్టు రట్టు

22 Aug, 2022 21:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ధనవంతులను దోచుకుంటూ.. అందులో కాస్త పేదలకు పంచిపెడుతోన్న ‘రాబిన్‌ హుడ్‌’ తరహా ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు సోమవారం తెలిపారు. ఆ గ్యాంగ్‌లో 25 మంది సభ్యులు ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వసీం అక్రం (27) అలియాస్ లంబూ, అతని ముఠా.. దేశ రాజధానిలోని ధనవంతుల ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది. డబ్బులు, బంగారు ఆభరణాలు కాజేసింది. అందులో కొంత మొత్తాన్ని పేదలకు పంచిపెట్టింది’ అని ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు. ఈ కారణంగానే అతనికి చాలా మంది అనుచరులు ఏర్పడ్డారని.. పోలీసుల కదలికలపట్ల ముందే సమాచారం అందిస్తూ..  తప్పించుకునేందుకు వీలుగా సహకరించేవారని తెలిపారు.

దొంగతనాలకు అలవాటు పడిన వసీం అక్రం.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రహస్య స్థావరాలను తరచూ మార్చేవాడని పోలీసులు చెప్పారు. దొంగతనాలు, హత్యాయత్నం, అత్యాచారం తదితర 160 కేసులు అతనిపై ఉన్నాయని తెలిపారు. గత 4 నెలలుగా అతని కదలికలపై నిఘా ఉంచిన ప్రత్యేక బృందం.. ఎట్టకేలకు పట్టుకుందని తెలిపారు. ‘ఇన్‌స్పెక్టర్ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ సమీపంలో వేసిన ఉచ్చులో వసీం చిక్కాడు’ అని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి మూడు బుల్లెట్‌లతో కూడిన సింగిల్ షాట్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: మలద్వారంలో గ్లాస్‌తో 10 రోజులుగా నరకం.. వైద్యులు ఏం చేశారంటే?

మరిన్ని వార్తలు