ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టిన పోలీసులు!.. కాంగ్రెస్‌ ఆగ్రహం, రాజ్‌భవన్ల ముట్టడికి పిలుపు

15 Jun, 2022 15:05 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో.. కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బుధవారం నిరసనలు కొనసాగుతున్న సమయంలో.. అక్బర్‌రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక టైంలో ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టి పోలీసులు కార్యాయంలోకి వచ్చి, తమ నేతలను అరెస్ట్‌ చేసినట్లు కాంగ్రెస్‌ ఆరోపణలకు దిగింది. ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారాయన.

కాంగ్రెస్‌ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర చాలా మంది వ్యక్తులు పోలీసులపై బారికేడ్లు విసిరారు. కాబట్టి గొడవ జరిగి ఉండవచ్చు. అంతేగానీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లి లాఠీఛార్జ్‌ చేయలేదు. పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయడం లేదు. మాతో సమన్వయం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాం అని ఎస్పీ హుడా, స్పెషల్ సీపీ (ఎల్‌అండ్‌ఓ) తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్‌ కార్యకర్తలు.

ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు ఇచ్చింది. గురువారం రాజ్‌భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. తెలంగాణలో రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా చేపట్టనున్నాయి. రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు