Delhi High Court: పోలీసులపై ఢిల్లీ ధర్మాసనం ఆగ్రహం

17 May, 2021 15:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినా వైరస్ బారిన పడి చనిపోతున్నవారి సంఖ్య తగ్గట్లేదు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, మందుల కొరతతో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో పడకల, ఆక్సిజన్ కొరత నెలకొనడంతో.. సకాలంలో వైద్యం అందక అధిక సంఖ్యలో కరోనా రోగులు మరణించారు. ఒక్క సర్ గంగారాం ఆస్పత్రిలోనే 20 పైగా కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు.

తాజాగా ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తుండటంతో ఆస్పత్రుల్లో కొరత ఏర్పడింది. ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రశ్నించింది. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్‌కి తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఆక్సిజన్ సిలిండర్ అక్రమంగా నిల్వ చేసిన కేసుకు సంబంధించి.. ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌తో సహా.. మరో తొమ్మిది మంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపై సోమవారం ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

"మీరు బాధ్యతతో వ్యవహరించాలి. ఆక్సిజన్‌, కరోనా మందులు.. నిల్వచేసుకుని వ్యాపారం చేయడానికి ఇది సమయం కాదు. రాజకీయ పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకుని​ వ్యాపారంగా ఎలా మార్చుకుంటాయి? ప్రిస్క్రిప్షన్ లేకుండా వారు ఆక్సిజన్‌ ఎలా కొనుగోలు చేయవచ్చు? నిజం ఏంటో..బయట పెట్టే ఆసక్తి మీకు లేదు అనిపిస్తోంది." అంటూ విపిన్ సంఘి, జస్మీత్ సింగ్ ధర్మాసనం ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "కొంతమంది రాజకీయ ప్రముఖులు దీనిలో ఉన్నందున, ఈ విధంగా దర్యాప్తు చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయడం మీ విధి. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. కరోనా మందుల కొరత కారణంగా ఎంత మంది మరణించారో గ్రహించారా అని ప్రశ్నించింది. అంతే కాకుండా దీనిపై సరైన విచారణ జరపాలని ఢీల్లీ ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. పేద ప్రజల అందించే ఔషధాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)కు అప్పగించాలని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

(చదవండి: Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి)

మరిన్ని వార్తలు