గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు నమోదు!

5 Feb, 2021 03:20 IST|Sakshi
ఢిల్లీలో గ్రెటా దిష్టిబొమ్మను దహనం చేస్తున్న యునైటెడ్‌ హిందూ ఫ్రంట్‌ కార్యకర్తలు

విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్నారని ఆరోపణలు

బెదిరింపులకు భయపడన్న థన్‌బర్గ్‌

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్లు చేసిన స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ గ్రెట్గా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని స్పష్టం చేస్తూ మరో ట్వీట్‌ చేశారు.

బెదిరింపులు, కేసులు తన వైఖరిని మార్చలేవని తేల్చిచెప్పారు. భారత్‌లో రైతన్నల ఆందోళనలు, నిరసనలపై రెండు రోజుల క్రితం థన్‌బర్గ్‌ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. ఆమెను తప్పుపడుతూ భారత్‌లో పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదంటూ హితవు పలికారు. థన్‌బర్గ్‌ ట్వీట్లు వివాదాస్పదం కావడంతో ఢిల్లీ సైబర్‌ సెల్‌ పోలీసులు వీటిపై దర్యాప్తు ప్రారంభించారు. థన్‌బర్గ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది.

‘థన్‌బర్గ్‌కు సాహస బాలిక అవార్డివ్వాలి’
గ్రెటా థన్‌బర్గ్‌కు భారత ప్రభుత్వం సాహస బాలిక పురస్కారం ప్రదానం చేయాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ గురువారం పేర్కొన్నారు. దేశాన్ని అస్తిరపర్చేందుకు జరుగుతున్న కుట్రకు సంబంధించిన పత్రాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినందుకు గ్రెటా థన్‌బర్గ్‌కు ఈ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.  రైతులకు మద్దతు పేరిట భారతదేశాన్ని అస్తిరపర్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి విదేశీ సర్టిఫికెట్‌ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కేనని అన్నారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. విదేశీ శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విదేశీ శక్తులకు పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టం విషయంలో విదేశీయుల జోక్యం ఏమిటని బీజేపీ నేత అమిత్‌ మాలవియా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు