ప్రవక్త వ్యాఖ్యల ఎఫెక్ట్‌: చంపుతామంటూ ఫోన్లు.. నూపుర్‌ శర్మకు గన్‌ లైసెన్స్‌ జారీ

13 Jan, 2023 11:02 IST|Sakshi

ఢిల్లీ: మొహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన నూపుర్‌ శర్మకు గన్‌ లైసెన్స్‌ జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. కిందటి ఏడాది ఓ టీవీ డిబేట్‌లో ఆమె ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు.. యావత్‌ ప్రపంచంలోనూ మంట పుట్టించాయి. ఆపై ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది కూడా. అయితే..

తనకు ప్రాణ హాని ఉందని, తరచూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ ఆమె ఎప్పటి నుంచో పోలీసులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కోరారామె. ఈ నేపథ్యంలోనే ఆమెకు గన్‌ లైసెన్స్‌ జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ లైసెన్స్‌ ఆధారంగా ఆమె ఆత్మ రక్షణ కోసం తుపాకీని వెంట పెట్టుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు.. సుప్రీం కోర్టు సైతం ఆమె భద్రత కారణాల దృష్ట్యా.. దేశంలో ఆమెపై దాఖలైన(దాఖలు అవుతున్న కూడా) ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదలాయించాలని ఆదేశించి ఆమెకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అంతకు కొన్నినెలల ముందు.. నూపుర్‌ శర్మ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె తక్షణ క్షమాపణలు చెప్పాల్సిందని అభిప్రాయపడింది. బాధ్యత గల న్యాయవాది వృత్తిలో అనుభవం ఉండి.. సోయి లేకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో విద్వేషాలకు దారి తీసిందని, పరిణామాలకు ఆమె ఒక్కతే బాధ్యత వహించాలంటూ కూడా అభిప్రాయపడింది. 

ఇక నూపుర్‌కు మద్దతు వ్యాఖ్యలు చేసినందుకే.. రెండు హత్యలు జరగడం దేశాన్ని కుదిపేసింది కూడా. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ ఓ టైలర్‌ను, ఆపై మహారాష్ట్ర అమరావతిలో ఓ ఫార్మసిస్ట్‌ను దారుణంగా హతమార్చారు. మరోవైపు ఆమెను హతమారుస్తామంటూ కొందరు వీడియోల ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డంతో ఆమె కొన్నాళ్లూ అజ్ఞాతంలోనూ గడిపారు.

మరిన్ని వార్తలు