శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. సునంద మృతి కేసులో కోర్టు నోటీసులు

1 Dec, 2022 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను ఆయన భార్య సునంద పుష్కర్‌ మృతి కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో శశిథరూర్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వటంపై హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ పోలీసులు. థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టవేస్తూ గతేడాది పాటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. 

పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ ఢీకే శర్మ.. పిటిషన్‌ కాపీని శశి థరూర్‌ న్యాయవాదికి అందించాలని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాదికి సూచించారు. పిటిషన్‌ కాపీ తమకు అందలేదని, అది ఉద్దేశ పూర్వకంగానే మరో మెయిల్‌కు పంపి ఉంటారని థరూర్‌ న్యాయవాది ధర్మాసనానికి తెలపడంతో ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు.. రివిజన్‌ పిటిషన్‌ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని సూచించింది ధర్మాసనం. కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. 

ఇదీ కేసు.. 
2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా పుష్కర్‌ అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం సృష్టించింది. తొలుత హత్య కోణంలో దర్యాప్తు జరిపినా.. చివరకు ఆత్మహత్యగా పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్‌ ప్రేరేపించారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్‌ కోర్టు.. 2021, ఆగస్టులో ఆ అభియోగాలను కొట్టివేస్తూ థరూర్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

ఇదీ చదవండి: రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్‌

మరిన్ని వార్తలు