11 నెలలకు.. తొలగిన అడ్డంకులు

30 Oct, 2021 05:10 IST|Sakshi

ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు తీసేస్తున్న పోలీసులు

మా వాదనకు మద్దతు లభించింది: రైతు నేతలు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు ప్రారంభమైంది. రైతు ఆందోళనల కారణంగా టిక్రి, ఘాజీపూర్‌లలో రోడ్లపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాదాపు 11 నెలల తర్వాత గురువారం నుంచి పోలీసులు తొలగిస్తున్నారు. ఈ పరిణామంపై రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..తమ వాదనకు మద్దతు దొరికినట్లయిందని వ్యాఖ్యానించారు.

దేశ రాజధాని సరిహద్దు పాయింట్లను తామెన్నడూ దిగ్బంధించ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే విషయాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నిర్ణయిస్తుందని చెప్పారు. రహదారులపై అడ్డంకులకు పోలీసులే కారణమంటూ రైతు సంఘాలు ఇటీవల సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.

రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసింది పోలీసులే తప్ప, రైతులు కాదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసులు రోడ్లను తిరిగి తెరుస్తున్నారన్నారు. తదుపరి కార్యాచరణను ఎస్‌కేం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం అధికారులు మూసివేశారని వారు చెప్పారు. టిక్రి, ఘాజీపూర్, సింఘుల వద్ద రైతు సంఘాలు గత ఏడాది నవంబర్‌ 26వ తేదీ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో పోలీసులు నాలుగైదు అంచెల్లో వైర్లతో కూడిన ఇనుప, సిమెంట్‌ బారికేడ్లను  నిర్మించారు.

సాగు చట్టాలను రద్దు చేయాలి: రాహుల్‌
ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పోలీసులు తొలగించిన విధంగానే మూడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను కూడా ఉపసంహరించు కోవాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  

ఎంఎస్‌పీకి చట్టబద్ధత ఇవ్వాలి: వరుణ్‌ గాంధీ
రైతు సమస్యల విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద పెచ్చరిల్లిన అవినీతి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు.  కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు.

రైతు కుటుంబాలకు ప్రియాంక పరామర్శ
యూపీలోని లలిత్‌పూర్‌లో ఎరువుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరామర్శించారు. అధికారులు, నేతలు, అక్రమార్కుల కారణంగా రైతుల ఎరువులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు