ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్

22 Sep, 2020 10:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైతులకు మేలు చేస్తాయనే పేరుతో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఒకవైపు తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలనే తీర్మానానికి రాజ్యసభ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా సభలో పోడియంలోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగారు. ఇది 8మంది ఎంపీల సస్పెన్షన్ కు దారితీసింది. అయితే పట్టువదలకుండా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రధానంగా పార్లమెంటు సమీపంలో సోమవారం మౌనంగా నిరసన చేపట్టిన పంజాబ్‌కు చెందిన నలుగురు పార్లమెంటు సభ్యుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఎంపీలపై దాడికి దిగారు. కాళ్లపై లాఠీలతో కొడుతూ, వారిని అక్కడినుంచి తొలగించేందుకు ప్రయత్నించారు.  (8 మంది ఎంపీల సస్పెన్షన్‌)

అయితే పార్లమెంటు షెడ్యూల్ కంటే ముందే బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దారి క్లియర్ చేసేందుకు ప్రయత్నించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఎంపీలు తమ నిరసనకు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ప్రధానికి దారి క్లియర్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించారు. టీ తాగాలని కోరారు. దీనికి ససేమిరా అన్న ఎంపీలు ఆయన్ను రైతు వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఇది ఇలావుంటే హరివంశ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ఆయన తీరు ఆదర్శ ప్రాయమని వ్యాఖ్యానించడం గమనార్హం. (‘ఆ బిల్లులను అడ్డుకోండి’)

కాగా కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులును వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 25న దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన ప్రస్తుత బిల్లుతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులు మరింత నష్టాల్లోకి జారిపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లులు కార్పొరేట్లకు కొమ్ము కాసేవే తప్ప, రైతులకు మేలు చేసేవి ఎంతమాత్రం కాదనివాదిస్తున్నాయి. అటు సస్పెన్షన్ కి గురైన ఎంపీలు, రాత్రంతా పార్లమెంట్ ఎదుట తమ నిరసనను కొనసాగించారు. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బిల్లులును సభలో ఆమోదించారని మండిపడ్డారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందంటూ నిరసనను కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు