ఢిల్లీలో కుంభవృష్టి

2 Sep, 2021 05:00 IST|Sakshi
ఢిల్లీలో ట్రాఫిక్‌ జామ్‌ అయిన దృశ్యం

సెప్టెంబర్‌లో 19 ఏళ్లలో చూడనంతటి భారీ వర్షం

జలమయమైన హస్తిన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని అనూహ్య వర్షం ముంచెత్తింది. గత 19 ఏళ్లలో సెప్టెంబర్‌ నెలలో ఒకే రోజులో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర సమయానికల్లా ఏకంగా 112.1 మిల్లీమీటర్ల వర్షపాతంతో వరుణుడు హస్తినను కుంభవృష్టితో తడిసి ముద్దయ్యేలా చేశాడు. ఢిల్లీలో చాలా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కేవలం మూడు గంటల్లోనే 75.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చాణక్యపురి, ఐటీవో, రోహతక్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు భారీ స్థాయిలో చేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ‘కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల రీతిలో స్వల్ప మార్పులొస్తున్నాయి. అందుకే ఇలాంటి కుండపోత వర్షాలను మేం కూడా ముందుగా అంచనావేయలేకపోతున్నాం. ఏడో తేదీ నుంచి ఇదే స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంది’ అని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. వర్షం సాధారణ స్థాయిలో కురిస్తే భూగర్భ జలాల మట్టం పెరిగే ప్రయోజనం ఉందని, కానీ ఇలా కుంభవృష్టి వర్షాలతో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేయడం తప్ప మరే లాభం లేదని వాతావరణ నిపుణులు వివరించారు.
 

మరిన్ని వార్తలు