ప్రధాని పుట్టినరోజు.. రూ.8.5 లక్షలు గెలుచుకునే లక్కీ ఛాన్స్‌!

16 Sep, 2022 17:36 IST|Sakshi

అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌ యజమాని ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా కస్టమర్లకు థాలి ఆఫర్‌ ప్రకటించాడు. తన హోటల్‌లోని థాలి తింటే.. రూ.8.5 లక్షల నగదు గెలుచుకోవచ్చని ప్రధానిపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. కాగా సెప్టెంబరు 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు. 

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్‌( ARDOR ) 2.1 రెస్టారెంట్లో 56 వంటకాలతో ఓ బాహుబలి థాలిని ఏర్పాటు చేశాడు ఓ రెస్టారెంట్‌ యజమాని. ఇందులో కస్టమర్లు తమకు నచ్చిన వెజ్ లేదా నాన్ వెజ్ ఐటెమ్‌ను ఆర్డర్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్పెషల్‌ థాలిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. "ప్రధాని మోదీని నేను చాలా గౌరవిస్తాను, అందుకే ఆయన పుట్టినరోజున ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాను. అందుకే థాలి పోటీ పెట్టినట్లు చెప్పారు. ప్రత్యేకమైన థాలీకి ’56 అంగుళాల మోదీజీ’ అని పేరు పెట్టినట్లు వివరించారు.

ప్రత్యేకంగా తయారు చేసిన ఈ థాలిని తినే కస్టమర్లకు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలో దంపతులు కూడా పాల్గొనవచ్చని.. ఆ జంట నుంచి ఎవరైనా ఈ థాలీని 40 నిమిషాల్లో పూర్తి చేస్తే, వారికి 8.5 లక్షల రూపాయల బహుమతిని అందుకోవచ్చని తెలిపారు. అలాగే, సెప్టెంబర్ 17-26 మధ్య రెస్టారెంట్‌లో ఈ థాలీ తిన్నవారిలో లక్కీ విన్నర్‌ని ఎంపిక చేసి వారికి కేదార్నాథ్ పర్యటన అవకాశం కల్పిస్తామన్నారు.

చదవండి: SCO Summit: చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్‌, నో షేక్‌హ్యండ్‌

మరిన్ని వార్తలు