క్షణమొక యుగంలా గడిచింది, లేదంటే 100 ప్రాణాలు..

26 Apr, 2021 12:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి యాజమాన్యం  ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించుంటే వందకు పైగా రోగుల ప్రాణాలు ఆక్సిజన్‌ లేక గాల్లో కలిసేవి. వెంటనే అప్రమత్తం  కావడంతో మరో జైపూర్‌ ఘటనను పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఆస్పత్రి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఆస్పత్రిలో సుమారు 100 మందికి పైగా రోగులు వైద్యం చేయించుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లతోనే వారి వైద్యం జరుగుతోంది.

ఇంతలో ఆక్సిజన్‌ నిల్వలు రోగులకు సరిపడా లేదని సిబ్బందికి తెలిసింది. వారు ఈ సమాచారాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలిపారు. కరోనా నేపథ్యంలో బయట మార్కెట్లో ఎక్కడ కూడా అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. ఇక జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో విషాదం పునరావృతమవుతుందనే భయాందోళనల మధ్య ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మరుతోంది. గంటలు తరబడి ఆస్పత్రి యాజమాన్యం సిలిండర్ల  కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరకు కోర్టు తలుపు తట్టగా అధికారులు స్పందించి షేరింగ్ ప్రాతిపదికన గ్యాస్‌ ట్యాంకర్‌ను సిద్ధం చేశారు. 

కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది. ఆక్సిజన్ తీసుకొచ్చిన ట్యాంకర్‌ ఆస్పత్రిలోకి వెళ్లే వీలు లేకుండా పోయింది. దారి చిన్నది కావడంతో ఆస్పత్రి ఎల్‌ఎంఓ (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) ట్యాంక్ ఉన్న ప్రాంతంలోకి ట్యాంకర్‌ రాలేకపోయింది. ‘మేము ఎలక్ట్రానిక్ సుత్తులతో మా గోడ భాగాన్ని పగలకొట్టడం ప్రారంభించాము. కానీ దీనికి సమయం పట్టేలా ఉందని గ్రహించి.. అధికారులకు విషయం చెప్పడంతో జేసీబీని రప్పించారు. జేసీబీ గోడలను బద్దలు కొట్టడంతో హుటాహుటిన ఆక్సీజన్‌ ట్యాంకర్‌తో సేవలను పునరుద్ధరించి రోగులకు ఆక్సిజన్‌ను అందించామని ’ ఆస్పత్రి యజమాని చావ్లా తెలిపారు. ఇక ఆక్సీజన్‌ సరఫరా అయ్యేంత వరకు తమవారి ప్రాణాలు గాల్లో దీపంలా తోచాయని బాధితుల బంధువులు చెప్పుకొచ్చారు. ఆస్పత్రి యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు.

( చదవండి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం )

మరిన్ని వార్తలు