‘నాన్న నేను లాయర్‌ అవుతానని చెప్పి.. ఉన్మాది కత్తికి బలైంది’

30 May, 2023 12:14 IST|Sakshi

న్యూఢిల్లీ: రోజూ వారి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంచే ఆ తండ్రి సంపన్నుడు కానప్పటికీ తన కూతురిని ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. ఇక ఆ బాలిక కూడా అందుకు తగ్గట్లే ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది. ఆ ఆనందాన్ని కుటుంబంతో పంచుకుని తాను లాయర్‌ కావాలన్న తన కలను తండ్రితో పంచుకుంది. అయితే పాపం తనకు తెలియదు స్నేహితుడే కాలయముడై తన కలలని కాలరాస్తూ, అర్థాంతరంగా జీవితాన్ని ముగిస్తాడని. స్నేహితురాలి ఇంటి నుంచి వస్తున్న ఆమెను మృత్యువు వెంబడిస్తోందని తెలుసుకోలేకపోయింది.. దారుణంగా హత​మైంది.

ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన సాక్షి అనే పదహారేళ్ల బాలిక ఉన్నాది కత్తికి బలైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్న తన కూతురు మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి జనక్‌రాజ్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బిడ్డ లాయర్‌ కావాలనుకుంటున్నట్లు తనకు చెప్పిందని.. కానీ ఇలా దారుణం జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.తన కూతురిని కిరాతకంగా చంపిన నిందితుడిని ఉరిశిక్ష విధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

సాహిల్‌(నిందితుడు) గురించి తనకు ఏమీ తెలియదని,  సాక్షి తన స్నేహితుల గురించి మాకు చెప్పింది, కానీ అతని గురించి ఎప్పుడూ చెప్పలేదని చెప్పాడు. పోలీసులు మాత్రం సాక్షికి, నిందితుడు సాహిల్‌ గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, శనివారం వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని చెబుతున్నారు. ఆదివారం పుట్టినరోజు వేడుక కోసం బయటకు వచ్చిన సాక్షిని అనుసరించి ఆమెతో మరోమారు సాహిల్ వాగ్వివాదానికి దిగాడు.

ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయి ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ఈ దారుణం జరుగుతుండగా ఆ వీధిలో పలువురు చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవ్వరూ అతడిని ఆపేందుకు ప్రయత్నించలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు షాబాద్‌ డెయిరీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి అరెస్టు చేశారు. 

చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!

మరిన్ని వార్తలు