వీడియో: శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్‌ సుఖనిద్ర!.. ఉన్మాదిపై 24/7 పోలీసు కన్ను

15 Nov, 2022 11:27 IST|Sakshi

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ప్రియురాలిని అతికిరాతకంగా హత్య చేసిన ఓ ప్రియుడి ఉదంతం.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రియురాలిని చంపి 35 ముక్కలుగా చేసి.. నగరంలో అక్కడక్కడ పడేశాడు దుండగుడు. దేశరాజధాని నుంచి వెలుగు చూసిన ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది. అయితే.. 

ఈ కేసులో దుండగుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా(28)ను పటిష్టమైన భద్రత నడుమ ఉంచారు పోలీసులు. సౌత్‌ ఢిల్లీలోకి మెహ్రౌలీ పోలీస్‌ స్టేషన్‌లో మరో ఖైదీతో పాటు ఉంచారు. నేలపై దుప్పటి కప్పుకుని అతని ప్రశాంతంగా నిద్రించడం చూడొచ్చు. ఇక సెల్‌ను కవర్‌ చేసేలా సీసీటీవీ ఫుటేజీని ఉంచిన పోలీసులు.. ఆ సెల్‌ బయట ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలా ఉంచారు.

అంతేకాదు.. అధికారులు సైతం అతని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక లోపల ఉన్న మరో ఖైదీ బిక్కుబిక్కుమంటూ కనిపించడం వీడియోలో ఉంది. తనను సెల్‌ మార్చాలని ఆ ఖైదీ వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. కీలకమైన కేసు కావడం, పైగా అప్తాబ్‌ మానసిక స్థితిపై అనుమానాల నేపథ్యంలోనే ఇలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అతన్ని అలాగే చూసుకోవాల్సి ఉంటుంది. 

శ్రద్ధా వాల్కర్‌ అనే యువతితో సహజీవనం చేసిన  అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా.. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నో చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే 18వ తేదీన ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ పెద్ద ఫ్రీజర్‌లో భద్రపరిచాడు. పద్దెనిమిది రోజులపాటు రోజూ అర్ధరాత్రి పూట బయటకు వెళ్లి.. ఆమె విడిభాగాల్ని నగరంలో అక్కడక్కడ పడేసి వచ్చాడు. రెండు నెలలుగా ఆమె సోషల్‌ మీడియా అకౌంట్లు యాక్టివ్‌గా లేకపోవడం, ఫోన్‌ సైతం లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు.. తండ్రికి విషయం చెప్పాడు. ఆయన నవంబర్‌లో కూతురు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు కిడ్నాప్‌ ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది.

ముంబైలో ఓ ఎంఎన్‌సీ కాల్‌సెంటర్‌లో పని చేసే శ్రద్ధకు.. డేటింగ్‌ యాప్‌ ద్వారా అఫ్తాబ్‌తో పరిచయం అయ్యింది. ఇంట్లో వాళ్లు వాళ్ల రిలేషన్‌షిప్‌కు ఒప్పుకోకపోవడంతో.. ముంబైని విడిచి ఢిల్లీకి వచ్చారు. పెళ్లి చేసుకోమని కోరడంతో అతను ఒప్పుకోలేదు. మరికొందరు అమ్మాయిలతో అతను సంబంధం కొనసాగించినట్లు శ్రద్ధకు తెలిసింది. దీంతో ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతోనే దారుణంగా హతమార్చాడు. విచారణలో తొలుత పొంతన లేకుండా సమాధానాలు చెప్పిన అఫ్తాబ్‌.. చివరకు నేరం అంగీకరించాడు. అతని ఫోన్‌ హిస్టరీలో నేరానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. ఆంగ్ల క్రైమ్‌ సిరీస్‌ డెక్స్‌టర్‌ ప్రేరణతోనే తాను ఈ హత్య చేశానని నేరం ఒప్పుకున్నాడు అప్తాబ్‌.

సంబంధిత కథనం:  300 లీటర్ల ఫ్రిడ్జి కొని.. అగరబత్తులతో..

మరిన్ని వార్తలు