ప్రపంచవ్యాప్తంగా మన నగరమే మొదటి స్థానం.. కానీ అదో చెత్త రికార్డ్

13 Nov, 2021 17:05 IST|Sakshi

న్యూఢిల్లీ: మన దేశంలో వాయు కాలుష్యం గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. అభివృద్ధి పరంగా ఎంత ముందుందో కాలుష్యం కూడా అంతే ముందుంది. రోజురోజుకీ ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం పెరిగి అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడం ఢిల్లీ కాలుష్య పరిస్థితిని మరింత దిగజార్చిoది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దేశం నుంచి ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ గాలి నాణ్యత, కాలుష్యాన్ని ప్రమానికాలుగా తీసుకుంటారు. ఆ టాప్‌-10 జాబితా ఓ సారి చూస్తే.. పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతునే ఉన్న పరిష్కారం మాత్రం దొరకడం లేదు.

శనివారం దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోయింది. ఏక్యూఐ 476గా నమోదైంది. వచ్చే 48 గంటల పాటు వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు పాఠశాలలను మూసివేడంతో పాటు వాహనాలను ‘బేసి-సరి’ విధానం అమలు చేయడంతో పాటు నిర్మాణాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే యూపీలోని బులంద్‌షహర్‌, హాపూర్‌, నోయిడా, మీరట్‌, ఘజియాబాద్‌లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది.  ఇదిలా కొనసాగితే భవిష్యత్తు లో ఇంట్లో కూడా మాస్కులు వేసుకోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు