ఢిల్లీ సుల్తాన్‌పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా?

3 Jan, 2023 09:32 IST|Sakshi

దర్యాప్తునకు అమిత్‌ షా ఆదేశం

ఢిల్లీ:  దేశ రాజధానిలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరం మొదటిరోజు వేకువ జామున   ప్రాణం పోయి రోడ్డు మీద నగ్న స్థితిలో బాధితురాలు కనిపించిన ఘటన ఢిల్లీని కుదిపేసింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే పోలీసుల దర్యాప్తులో.. ఈ హేయనీయమైన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

తాజాగా.. ఘటన సమయంలో అంజలితో పాటు మరో యువతి కూడా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆమెను అంజలి స్నేహితురాలిగా భావిస్తున్నారు. అయితే కారు ఢీ కొట్టడంతో స్కూటీ నుంచి కింద పడి గాయాలైన ఆ యువతి.. భయంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరి ఉండొచ్చని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, ఆమెను విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడొచ్చని ఆ సీనియర్‌ అధికారి వెల్లడించారు.   

పోలీసులు పట్టించుకోలేదు: ప్రత్యక్ష సాక్షి
ఇక ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితులు, వాళ్ల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు నమోదు చేసిన పోలీసులు ప్రకటించారు. కానీ, ప్రత్యక్ష సాక్షి దీపక్‌  మాత్రం కారులో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని కారుతో లాక్కెళ్లారని, గంటన్నర పాటు పలుమార్లు యూటర్నులు తీసుకుంటూ దాదాపు 13 కి.మీ. దూరం వాహనాన్ని నడిపారని వెల్లడించడం కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు.. అరుస్తూ తన టూవీలర్‌పై కారును వెంబడించినట్లు అతను తెలిపాడు. ఆపై పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వ్యాన్‌ను ఆపి విషయం దృష్టికి తీసుకెళ్లినా.. కనీసం వాళ్లు స్పందించలేదని, ఆ కారును ఆపే యత్నం చేయలేదని దీపక్‌ ఆరోపించాడు. ఆపై గంటన్నర సమయంలో 20 సార్లు ఫోన్‌ చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని దీపక్‌ మీడియాకు వెల్లడించాడు. మరోవైపు రోడ్డులో పోలీస్‌ బారికేడ్లు చూసి కారు యూటర్న్‌ తీసుకోవడం తాను చూసినట్లు ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ తెలిపాడు. కారుతో నిర్దాక్షిణ్యంగా బాధితురాలిని లాక్కెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 

దర్యాప్తునకు అమిత్‌ షా ఆదేశం 
ఢిల్లీ ఘటన కుదిపేస్తుండడంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు.  కేంద్ర హోం మంత్రిత్వశాఖ తరపున విచారణకు ఆదేశించారు. ఢిల్లీ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ షాలిని సింగ్‌ను దర్యాప్తునకు నేతృత్వం వహించాలని, వీలైనంత త్వరగతితన నివేదిక అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంకోవైపు ఢిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ కూడా పోలీసులకు నోటీసులిచ్చారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందా అన్న విషయాన్ని తెలపాలని ఆదేశించింది. నేడు శవపరీక్ష నివేదిక వచ్చే అవకాశం ఉండడంతో.. అసలేం జరిగింది అనే దానిపై ఒక స్పష్టత రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.  

ముమ్మాటికీ హత్యాచారమే!
ఇదిలా ఉంటే.. సుల్తాన్‌పురి ఘటనపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. తమ కూతురిపై హత్యాచార జరిగి ఉంటుందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని పలు సంఘాలు, స్థానికులు సుల్తాన్‌పురి పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టి రహదారిని దిగ్బంధం చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము ఉద్యమించడం ఆపబోమని ప్రకటించారు. 

భయమా? కావాలనేనా? 
ఆఫీస్‌ ముగించుకుని అర్ధరాత్రి(జనవరి 1వ తారీఖు) రెండు గంటల సమయంలో అంజలి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అంజలి ప్రయాణిస్తున్న స్కూటీని నిందితుల కారు ఢీ కొట్టింది. ఘటనకు కారణమైన కారు.. మారుతి బలెనో అసలు ఓనర్‌ లోకేష్‌. అతని నుంచి అశుతోష్‌ అనే వ్యక్తి కారును తీసుకోగా, మళ్లీ అశుతోష్‌ నుంచి అమిత్‌, దీప్‌ ఖన్నాలు కారు తీసుకుని తప్పతాగి చక్కర్లు కొట్టారు. ఖన్నాలతో పాటు స్థానిక బీజేపీ నేత.. రేషన్‌ షాప్‌ నడిపించే మనోజ్‌ మిట్టల్‌, స్పానిష్‌ కల్చరల్‌ సెంటర్‌లో పని చేసే కృష్ణన్‌, హెయిర్‌డ్రెస్సర్‌గా పని చేసే మిథున్‌ కూడా కారులోనే ఉన్నారు. దీపక్‌ ఖన్నా కారు డ్రైవ్‌ చేయగా.. మనోజ్‌ పక్క సీట్‌లో ఉన్నాడు. కారు ఢీ కొట్టిన దేనిమీద నుంచో ఎక్కించినట్లు అనిపించిందని దీపక్‌ అంగీకరించాడు. అయితే మిగతా వాళ్లు మాత్రం తాము అలాంటిదేం గమనించలేదని చెప్పినట్లు తెలుస్తోంది. స్కూటీని ఢీ కొట్టిన తర్వాత భయంతోనే వాళ్లు అక్కడి నుంచి ఉడాయించినట్లు చెప్తున్నారు. 

హత్యానేరం కింద కాకుండా.. దోషపూరిత హత్య(culpable homicide) అభియోగం కింద వాళ్లపై కేసులు నమోదు చేశారు.  అయితే.. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా వాళ్లపై కేసు నమోదు మారే అవకాశం ఉంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఆప్‌ సైతం నిరసనలకు మద్ధతు ప్రకటించింది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు