Delhi Acid Attack: స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు..

15 Dec, 2022 15:15 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్ విద్యార్థినిపై బుధవారం జరిగిన యాసిడ్ దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ చల్లారు.

అయితే ఈ ఘటనతో ప్రమాదకరమైన యాసిడ్ అందరికీ ఎంత సులభంగా దొరుకుతుందో మరోసారి బహిర్గతమైంది. యాసిడ్ విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ అది మార్కెట్లో లభిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ విద్యార్థినిపై దాడి చేసిన నిందితులు యాసిడ్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్‌ పెట్టి ఇంటికి తెప్పించుకున్నారు.

దీంతో ఇంత సులభంగా యాసిడ్ ఎలా దొరుకుతుందని ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సంస్థలు దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది.

ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వచ్చి దాడి చేసిన సచిన్ అరోరా, హర్షిత్ అగర్వాల్‌తో పాటు వీరికి సాయం చేసిన వీరేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు.

మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిన కారణంగా 2013లో వీటి విక్రయాలపై నిషేధం విధించింది సుప్రీంకోర్టు. లైసెన్స్ ఉన్న షాపు ఓనర్లే యాసిడ్‌ను విక్రయించాలని, వాటిని కోనుగోలు చేసే వారి వివరాలు సేకరించాలని నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ఇప్పటికీ మార్కెట్లో కూరగాయలు కొన్నంత ఈజీగా యాసిడ్‌ను కొనుగోలు చేస్తున్నారు.
చదవండి: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి..

మరిన్ని వార్తలు