Delhi University: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత

27 Jan, 2023 18:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్రయత్నించడం టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసు అధికారులు నిరాకరించారు. అయినా ఎన్‌ఎస్‌యూఐకి చెందిన విద్యార్థులు దీన్ని స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో క్యాంపస్‌కు కరెంట్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. 

ఫలితంగా విద్యార్థులు యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా యువత భారీగా తరలివచ్చారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. 24 మంది విద్యార్థులను  అరెస్టు చేశారు. తాము స్కీనింగ్‌కు ఏర్పాట్లు చేశామని, ల్యాప్‌టాప్లు, ప్రొజెక్టర్లను ధ్వసం చేశారని విద్యార్థులు ఆరోపించారు.

అటు అంబేడ్కర్ యూనివర్సిటీలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు విఫలయత్నం చేశారు. దీనికి కూడా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ఎలాంటి వీడియోలు ప్రదర్శించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అయినా వారు మెబైల్ ఫోన్లలో చూడాలనుకుంటే వారి విచక్షణకే వదిలేస్తామన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ 2002లో  గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇది దురుద్ధేశపూర్వకంగా ఉందని కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్‌లో ఈ వీడియో లింకులను బ్లాక్ చేసింది. అయినా కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ జేఎన్‌టీయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఈ వీడియో స్క్రీనింగ్‌కు ప్రయత్నించగా.. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
చదవండి: రాహల్‌ జోడో యాత్రకు సడెన్‌ బ్రేక్‌! కేవలం కిలోమీటర్‌ తర్వాతే..

మరిన్ని వార్తలు