వర్సిటీ వీసీపై వేటు

28 Oct, 2020 18:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వర్సిటీ నియామకాల్లో వివాదానికి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ యోగేష్‌ త్యాగిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులపై సస్సెండ్‌ చేసినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. యూనివర్సిటీ నియామకాలకు సంబంధించి వివాదంపై వీసీపై దర్యాప్తునకు అనుమతించాలని గతవారం విద్యామంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని  కోరింది.

నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై మంత్రిత్వ శాఖ ఆరోపణల నేపథ్యంలో వీసీపై విచారణకు రాష్ట్రపతి మంగళవారం రాత్రి ఆమోదం తెలిపారు. పదవిలో ఉండగా విచారణను ప్రభావితం చేస్తారని పేర్కొంటూ విచారణ ముగిసే వరకూ వీసీని సస్సెండ్‌ చేస్తున్నట్టు విద్యామంత్రిత్వ శాఖ వర్సిటీ రిజిస్ర్టార్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ప్రొఫెసర్‌ పీసీ జోషీ వీసీగా బాధ్యతలు చేపడతారని తెలిపింది. కాగా ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది జులైలో  వీసీ యోగేష్‌ త్యాగి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సెలవులో ఉన్నారు. త్యాగి తిరిగి విధుల్లో చేరేవరకూ ప్రొఫెసర్‌ పీసీ జోషీని ఇన్‌చార్జ్‌గా జులై 17న ప్రభుత్వం నియమించింది.

ఇక గతవారం జోషీని ప్రో వీసీగా తొలగించి ఆయన స్ధానంలో  గీతా భట్‌ను త్యాగి నియమించడంతో వివాదం నెలకొంది. మరోవైపు ప్రొఫెసర్‌ జోషి ఇటీవల నూతన రిజిస్ర్టార్‌గా వికాస్‌ గుప్తాను నియమించగా, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదించింది. అయితే అదే రోజు తాత్కాలిక రిజిస్ర్టార్‌గా పీసీ ఝాను నియమిస్తూ త్యాగి ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ, ప్రో వీసీల మధ్య అధికార వివాదంలో విద్యా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని త్యాగి సెలవులో ఉన్నందున ఆయన చేపట్టిన నియామకాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. చదవండి : గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు

మరిన్ని వార్తలు