డీలిమిటేషన్‌లో మార్పులు చేయలేం

5 Oct, 2022 06:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఆర్డర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌(యూటీ) స్పష్టం చేశాయి. ఈ పునర్విభజనకు సంబంధించి కమిషన్‌ ఏర్పాటు, దాని పరిధి, పదవీకాలం, అధికారాలపై ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన నేపథ్యంలో దీనిపైæ వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను సవాల్‌ చేస్తూ హజీ అబ్దుల్‌ గనీ ఖాన్, మహమూద్‌ మట్టూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం, జమ్మూకశ్మీర్‌(యూటీ), ఎన్నికల సంఘం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశాయి.

  పునర్విభజనపై ఏర్పాటైన కమిషన్‌ గెజిట్‌లో ప్రచురణ అయిన తర్వాత డీలిమిటేషన్‌ చట్టం–2002లోని సెక్షన్‌ 10(2) ప్రకారం సవాల్‌ చేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. మేఘరాజ్‌ కొఠారీ వర్సెస్‌ డీలిమిటేషన్‌ కమిషన్‌ కేసులో ఈ సెక్షన్‌ను ఇప్పటికే కోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. పిటిషన్లను అనుమతిస్తే గెజిట్‌ నిష్ఫలం అవుతుందని, ఇది ఆర్టికల్‌ 329ని ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపునకు సంబంధించి ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే కేసుతో సుప్రీంకోర్టు గతంలో జత చేసింది.

మరిన్ని వార్తలు