దేశంలో విజృంభిస్తున్న డెల్టా ప్లస్‌

26 Jun, 2021 04:30 IST|Sakshi

48 డెల్టా ప్లస్‌ కేసులు

అత్యధికంగా మహారాష్ట్రలో 20 కేసులు

డెల్టా ప్లస్‌ అంటే మరింత తీవ్రమని కాదు

కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ గల 48 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 45 వేల నమూనాలను పరీక్షించగా ఈ డెల్టా ప్లస్‌ కేసులు వెలుగు చూశాయని, మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు ఉన్నాయని తెలిపింది. ఈ పరివర్తనకు సంబంధించి చాలా తక్కువ కేసులు ఉన్నాయని చెబుతూ ఇవి పెరిగే ధోరణిని చూపిస్తుందని చెప్పలేమని స్పష్టం చేసింది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు మహారాష్ట్రలో 20, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్‌లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్‌లలో రెండేసి కేసులు ఉన్నాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజిత్‌ సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదైందని  విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ‘డెల్టా ప్లస్‌ మ్యుటేషన్‌ కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. గడిచిన 3 నెలల్లో 12 జిల్లాల్లో దాదాపు 50 కేసులు గుర్తించాం.

ఏ జిల్లాలో గానీ ఇది పెరుగుతున్న ధోరణిని చూపిస్తుందని చెప్పలేం‘అని సింగ్‌ తెలిపారు. డెల్టాలో కనిపించే ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ను ఈ వేరియంట్‌లో కూడా గమనించవచ్చని వివరించారు. దేశంలో కరోనా వైరస్‌ యొక్క జన్యు పరిణామ క్రమ విశ్లేషణలో ఎన్‌సీడీసీ పాల్గొంటోందని తెలిపారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్‌ను అదనపు మ్యుటేషన్‌తో సూచిస్తుందని సింగ్‌ చెప్పారు. బి.1.617.2.1 గా పరిగణిస్తారని, డెల్టా వేరియంట్‌కు కె.417ఎన్‌ జన్యు వేరియంట్‌ కలవడం వల్ల డెల్టా ప్లస్‌ అయ్యిందని వివరించారు. కె.417ఎన్‌ బీటా వేరియంట్‌లో కూడా ఉండడంతో ఇది ప్రాముఖ్యత కలిగి ఉందని వివరించారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను ప్లస్‌ గుర్తుతో సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీని అర్థం వ్యాప్తి తీవ్రత ఎక్కు వనో లేదా మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంద నో కాదు. అలాంటి శాస్త్రీయ ఆధారాలు తేలితే కచ్చితంగా తెలియజేస్తాం..‘అని ఆయన వివరించారు.  

డెల్టా వేరియంట్‌ వల్లే..
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లలో పాజిటివ్‌ నమూనాల్లో 50 శాతానికి పైగా నమూనాల్లో డెల్టా వేరియంట్‌ ఉందని ఆయన తెలిపారు. ‘ఈ నేపథ్యంలో రెండో వేవ్‌ సమయంలో ఉప్పెనలా వచ్చిన కేసులు ఈ వేరియంట్‌ వల్లే అన్న నిర్ణయానికి వచ్చాం’అని సింగ్‌ వివరించారు.

కొత్త కేసులు 51,667
దేశంలో 24 గంటల్లో కొత్తగా 51,667 కోవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,01,34,445కు చేరుకున్నాయని తెలిపింది. అదేవిధంగా, ఒక్క రోజులో ఈ మహమ్మారితో 1,329 మంది చనిపోగా మొత్తం మరణాలు 3,93,310కి చేరుకున్నాయి.

అత్యధిక స్థాయి నుంచి 88% తగ్గుదల
హా కోవిడ్‌ 19 కేసుల్లో దేశంలో అత్యధికంగా మే 7న 4,14,188 కొత్త కేసులు నమోదవగా, క్రమంగా తగ్గుతూ జూన్‌ 25 నాటికి 51,667 కేసులు నమోదయ్యాయి. అంటే మే 7 నుంచి జూన్‌ 25 నాటికి కొత్త కేసుల్లో 88 శాతం తగ్గుదల కనిపించింది.  

► వారం రోజుల్లో కొత్త కేసుల నమోదులో సగటున రోజుకు 24 శాతం మేర తగ్గుదల నమోదైంది. మే రెండో వారంలో 6.7 శాతం తగ్గుదల, మూడో వారంలో 22.3 శాతం తగ్గుదల, నాలుగో వారంలో 23.3% తగ్గుదల, మే 29 నుంచి జూన్‌ 4 మధ్య 33.1% తగ్గుదల, జూన్‌ 5–11 మధ్య 31.3% తగ్గుదల, జూన్‌ 12–18 మధ్య 30.3%, గత వారం 23.8% తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుంది. అయితే ఇందుకు వీలుగా కోవిడ్‌ కట్టడి చర్యలు పాటించాల్సి ఉంటుంది.  
► మే 4న దేశవ్యాప్తంగా 531 జిల్లాల్లో వందకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యేవి. జూన్‌ 2 నాటికి కేవలం 262 జిల్లాల్లోనే కేసులు నమోదయ్యేవి. జూన్‌ 23 నాటికి ఇలా వందకు పైగా నమోదవుతున్న జిల్లాల సంఖ్య 125కు తగ్గింది. వీటిలో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోని జిల్లాలే ఉన్నాయి.
► యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మే 10న అత్యధికంగా 31.3 లక్షల యాక్టివ్‌ కేసులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 6.13 లక్షలకు తగ్గింది. ఇదేస్థాయిలో  మే 3వ తేదీన 81.8 శాతం ఉన్న రికవరీ రేటు క్రమంగా 96.7 శాతానికి చేరుకుంది.
► పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్‌ 30–మే 6 మధ్య అత్యధికంగా పాజిటివిటీ రేటు 21.6 శాతం ఉండగా, జూన్‌ 24 నాటికి అది 3.1 శాతానికి చేరుకుంది.  

‘డెల్టా ప్లస్‌’పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
డెల్టా ప్లస్‌ కేసులు గుర్తించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హరియాణా ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖ రాశారు. కేసులున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తుల్లో కణాలతో  బంధం ఏర్పర్చుకోవడం, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకోవడం వంటి లక్షణాలున్నాయన్నారు.

మరిన్ని వార్తలు